నష్టాల నుంచి నేడు తొలుత రీబౌండ్‌?!

10 Sep, 2020 08:30 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 14 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 11,322-11,367 వద్ద రెసిస్టెన్స్‌

బుధవారం యూఎస్‌ మార్కెట్లు.. హైజంప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

వరుస నష్టాల నుంచి నేడు(10న) దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 11,321 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,307 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. యూఎస్‌ టెక్నాలజీ దిగ్గజాలలో మూడు రోజుల భారీ అమ్మకాలకు బుధవారం చెక్‌ పడింది. దీంతో యూఎస్‌ మార్కెట్లు జంప్‌చేశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఇటీవల ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్న మార్కెట్లు నేడు హుషారుగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చైనాతో సరిహద్దు వివాదాలు వంటి అంశాలు కొంతమేర సెంటిమెంటును దెబ్బతీయవచ్చని అభిప్రాయపడ్డారు.

మళ్లీ నష్టాలు
బుధవారం రోజంతా నేలచూపులకే పరిమితమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌  171 పాయింట్లు క్షీణించి 38,194 వద్ద నిలవగా.. నిఫ్టీ 39 పాయింట్లు తక్కువగా 11,278 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌కల్లా  37,935 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆపై కొంతమేర కోలుకుంటూ వచ్చి చివర్లో 38,253కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,298-11,185 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,209 పాయింట్ల వద్ద, తదుపరి 11,141 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,322 పాయింట్ల వద్ద, ఆపై 11,367 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,047 పాయింట్ల వద్ద, తదుపరి 21,826 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,521 పాయింట్ల వద్ద, తదుపరి 22,775 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

అమ్మకాల బాటలో
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 959 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.    

మరిన్ని వార్తలు