నేడు సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

23 Oct, 2020 08:47 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,950-12,003 వద్ద రెసిస్టెన్స్‌!

0.5 శాతం బలపడిన యూఎస్‌ మార్కెట్లు

లాభాలతో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

ఎఫ్‌పీఐల పెట్టుబడులు- డీఐఐల విక్రయాలు

నేడు (23న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు పుంజుకుని 11,925 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,899 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి నిరుద్యోగిత తగ్గుముఖం పట్టడంతోపాటు, గృహ విక్రయాలు 14ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెలువడిన గణాంకాలు గురువారం యూఎస్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ మార్కెట్లు తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి హెచ్చుతగ్గులు చవిచూడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వరుస లాభాలకు బ్రేక్‌
విదేశీ ప్రతికూలతల కారణంగా గురువారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో సెన్సెక్స్‌ 149 పాయింట్లు క్షీణించి 40,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్ల వెనకడుగుతో 11,896 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,722- 40,309 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,940- 11,824 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,834 పాయింట్ల వద్ద, తదుపరి 11,771 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,950 పాయింట్ల వద్ద, ఆపై 12,003 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 24,259 పాయింట్ల వద్ద, తదుపరి 24,034 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,700 పాయింట్ల వద్ద, తదుపరి 24,916 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,118 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,020 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 2,108 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,634 కోట్ల అమ్మకాలు చేపపట్టిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు