నేడు మార్కెట్ల ఫ్లాట్‌ ఓపెనింగ్‌?!

26 Oct, 2020 08:47 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 5 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 11,901-11,872 వద్ద సపోర్ట్స్‌!

ఎఫ్‌పీఐల పెట్టుబడులు- డీఐఐల విక్రయాలు

 నేడు (26న) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కేవలం 5 పాయింట్లు తక్కువగా 11,929 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,934 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్యాకేజీపై అనిశ్చితి కారణంగా శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో నిలిచాయి.  ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. గురువారం అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో నేడు దేశీ మార్కెట్లలో హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మళ్లీ ర్యాలీ బాట
నాలుగు రోజుల ర్యాలీకి గత గురువారం బ్రేక్‌ పడినప్పటికీ వారాంతాన తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరం‍దుకున్నాయి. సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభపడి 40,686 వద్ద నిలవగా.. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 11,930 వద్ద ముగిసింది. తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక దశలో సెన్సెక్స్‌ 40,811 వద్ద, నిఫ్టీ 11,975 పాయింట్ల వద్ద గరిష్టాలను తాకాయి. ఆపై కాస్త వెనకడుగు వేసి సెన్సెక్స్‌ 40,591 వద్ద, నిఫ్టీ 11,909 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాలకు చేరాయి. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,901 పాయింట్ల వద్ద, తదుపరి 11,872 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,967 పాయింట్ల వద్ద, ఆపై 12,004 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 24,305 పాయింట్ల వద్ద, తదుపరి 24,131 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,709 పాయింట్ల వద్ద, తదుపరి 24,938 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 907 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,118 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,020 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే

మరిన్ని వార్తలు