నేడు మార్కెట్ల హైజంప్?!

9 Nov, 2020 08:45 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 159 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 12319-12,374 వద్ద రెసిస్టెన్స్!

ఆసియా మార్కెట్లు 1-2 శాతం మధ్య ప్లస్

శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్

పెట్టుబడుల బాటలోనే ఎఫ్‌పీఐలు

ముంబై: నేడు (9న) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 159 పాయింట్లు జంప్ చేసి 11,421 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్‌ ఫ్యూచర్స్‌ 12,262 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్‌ పదవి రేసులో జో బైడెన్‌ ముందంజ వేసినప్పటికీ వారాంతాన యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు 1-2 శాతం మధ్య ఎగశాయి. అయితే వరుసగా 5 రోజులు ర్యాలీ చేసిన నేపథ్యంలో దేశీయంగా ఇంట్రాడేలో కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ముందుగానే దీపావళి
శుక్రవారం వరుసగా ఐదో రోజు మార్కెట్లు పరుగు తీశాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్ చేసి 41,893 వద్ద నిలిచింది. తద్వారా 42,000 పాయింట్ల మైలురాయికి చేరువలో ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు జమ చేసుకుని 12,264 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు 9 నెలల గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది జనవరి 24న మాత్రమే మార్కెట్లు ఈ స్థాయిలో కదిలాయి. ఫలితంగా జనవరిలోనే నమోదైన చరిత్రాత్మక గరిష్టాలకు మార్కెట్లు కేవలం 2 శాతం దూరంలో నిలిచాయి. ఐదు రోజుల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లు పురోగమించడం విశేషం. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,170 పాయింట్ల వద్ద, తదుపరి 12,077 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,319 పాయింట్ల వద్ద, ఆపై 12,374 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 26,338 పాయింట్ల వద్ద, తదుపరి 25,878 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 27,056 పాయింట్ల వద్ద, తదుపరి 27,314 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 5,368 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,208 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు