నేడు సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

4 Aug, 2020 08:31 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 10,830-10,768 వద్ద సపోర్ట్స్‌

సోమవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాల్లో

నేడు (4న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34  పాయింట్లు పుంజుకుని 10,950 వద్ద ట్రేడవుతోంది.  సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 10,916 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్‌ దిగ్గజాల అండతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.7-1.5 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ చైనా మినహా మిగిలిన మార్కెట్లు 1.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు.

37,000-11,000 దిగువకు
కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి పతనంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 667 పాయింట్లు కోల్పోయి 36,940 కు చేరగా.. నిఫ్టీ 182 పాయింట్ల వెనకడుగుతో 10,892వద్ద నిలిచింది. వెరసి సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు .. నిఫ్టీ  11,000 పాయింట్ల మార్క్ దిగువన స్థిరపడ్డాయి. సమయం గడిచేకొద్దీ అమ్మకాలు ఊపందుకోవడంతో తొలుత 11,058 వద్ద గరిష్టాన్ని తాకిన నిఫ్టీ.. తదుపరి 10,882 వద్ద కనిష్టాన్ని చేరింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,830 పాయింట్ల వద్ద, తదుపరి 10,768 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,006 పాయింట్ల వద్ద, ఆపై 11,120 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,888 పాయింట్ల వద్ద, తదుపరి 20,703 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,400 పాయింట్ల వద్ద, తదుపరి 21,728 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 7818 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశారు. వీటిలో బంధన్‌ బ్యాంకులో వాటా కొనుగోలు పెట్టుబడులు కలసి ఉండవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 136 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా..  వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 959 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 443 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు