మళ్లీ లాభాల ఓపెనింగ్‌‌?! 

9 Oct, 2020 08:27 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 51 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 11,896-11,958 వద్ద రెసిస్టెన్స్‌!

గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.8 శాతం ప్లస్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ట్రెండ్‌

పెట్టుబడుల బాటలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు

నేడు(9న) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 51 పాయింట్లు ఎగసి 11,878 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,827 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సహాయక ప్యాకేజీపై తిరిగి చర్చలు ప్రారంభంకావచ్చంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో గురువారం యూఎస్‌ మార్కెట్లు 0.8-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే.. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, వరుసగా 6 రోజులపాటు ర్యాలీ నేపథ్యంలో నేడు ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో నేడు మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.

సెన్సెక్స్‌@ 40,180
గురువారం దేశీ మార్కెట్లు 7 నెలల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు జంప్‌చేసి 40,183 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు జమ చేసుకుని 11,835 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  40,469 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,062 వద్ద కనిష్టం నమోదైంది. నిఫ్టీ 11,906-11,791 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,782 పాయింట్ల వద్ద, తదుపరి 11,729 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,896 పాయింట్ల వద్ద, ఆపై 11,958 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,020 పాయింట్ల వద్ద, తదుపరి 22,848 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,407 పాయింట్ల వద్ద, తదుపరి 23,623 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 978 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) స్వల్పంగా రూ. 20 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు