నేడు సానుకూల ఓపెనింగ్‌‌?!

2 Nov, 2020 08:39 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 23 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,749-11,856 వద్ద రెసిస్టెన్స్‌!

వారాంతాన యూఎస్‌ మార్కెట్ల పతనం

లాభాలతో కదులుతున్న ఆసియా మార్కెట్లు

శుక్రవారం ఎఫ్‌పీఐల అమ్మకాలు, డీఐఐల పెట్టుబడులు 

నేడు (2న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 23 పాయింట్లు పుంజుకుని 11,663 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్‌ ఫ్యూచర్స్‌ 11,640 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సెకండ్‌ వేవ్‌లో భాగంగా కోవిడ్‌-19 కేసులు ఉధృతంకావడంతో వారాంతాన యూఎస్‌ మార్కెట్లు 0.6-2.5 శాతం మధ్య క్షీణించాయి. యూరోపియన్‌ దేశాలలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలలో లాక్‌డవున్‌ తదితర కఠిన నియంత్రణలను ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో వారాంతాన సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఎల్‌జీ తదితర దిగ్గజాలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా నేడు మార్కెట్లలో కొంతమేర హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చివరికి నష్టాలే
ఆటుపోట్ల మధ్య వారాంతాన సెన్సెక్స్‌ 136 పాయింట్లు క్షీణించి 39,614 వద్ద నిలవగా.. నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,642 వద్ద ముగిసింది. తొలుత స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన సెన్సెక్స్‌ 39,988 వరకూ ఎగసింది. మిడ్‌సెషన్‌కల్లా 39,242కు వెనకడుగు వేసింది. ఇక నిఫ్టీ సైతం 11,749- 11,535 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,536 పాయింట్ల వద్ద, తదుపరి 11,429 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,749 పాయింట్ల వద్ద, ఆపై 11,856 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,583 పాయింట్ల వద్ద, తదుపరి 23,266 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,248 పాయింట్ల వద్ద, తదుపరి 24,595 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 871 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 631 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 421 కోట్ల అమ్మకాలు చేపట్టగా..  డీఐఐలు సైతం రూ. 253 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు