నేడు సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌!

24 Aug, 2020 08:33 IST|Sakshi

ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు ప్లస్‌

లాభాల్లో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

నిఫ్టీకి 11,406-11,440 వద్ద రెసిస్టెన్స్‌

టెక్‌ దిగ్గజాల అండ- యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌

నేడు (24న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.10 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 11,411 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,383 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్‌ దిగ్గజాల అండతో వారాంతాన యూఎస్‌ మార్కెట్లు 0.3-0.7 శాతం మధ్య ఎగశాయి. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. ఈ ప్రభావంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ మార్కెట్లు తొలి సెషన్‌లో సానుకూలంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జీడీపీ గణాంకాల వెల్లడి, ఎఫ్‌అండ్‌వో ముగింపు తదితర అంశాలు ముందున్న కారణంగా కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

బౌన్స్‌బ్యాక్
వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. సెన్సెక్స్‌ 214 పాయింట్లు పెరిగి 38,435 వద్ద నిలవగా.. నిఫ్టీ 59 పాయింట్లు బలపడి 11,372 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో నిఫ్టీ ఇంట్రాడేలో 11,418 వరకూఎగసింది. చివర్లో కొంత మందగించి 11,362 వద్ద కనిష్టానికి చేరింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,340 పాయింట్ల వద్ద, తదుపరి 11,318 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,406 పాయింట్ల వద్ద, ఆపై 11,440 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,195 పాయింట్ల వద్ద, తదుపరి 22,091 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,374 పాయింట్ల వద్ద, తదుపరి 22,449 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. అయితే గురువారం ఎఫ్‌పీఐలు రూ. 268 కోట్లు, డీఐఐలు రూ. 672 కోట్లు  చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

మరిన్ని వార్తలు