సెప్టెంబర్‌ సిరీస్‌ తొలి రోజు ఓకే?!

28 Aug, 2020 08:37 IST|Sakshi

32 పాయింట్లు ఎగసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

నిఫ్టీకి 11,604-11,649 వద్ద రెసిస్టెన్స్‌!

ఎస్‌అండ్‌పీ రికార్డ్‌- నాస్‌డాక్‌ వెనకడుగు

అటూఇటుగా ట్రేడవుతున్నఆసియా మార్కెట్లు  

నేడు (28న) సెప్టెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు ఎగసి 11,624 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,592 వద్ద నిలవగా.. గడువు ముగిసిన ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,561 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. గురువారం యూఎస్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య మిశ్రమంగా ముగిశాయి. వరుసగా ఐదో రోజు ఎస్‌అండ్‌పీ కొత్త గరిష్టానికి చేరినప్పటికీ నాస్‌డాక్‌ వెనకడుగు వేసింది. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. అయితే వరుసగా నాలుగు రోజులపాటు లాభాలతో ముగిసిన దేశీ స్టాక్‌ మార్కెట్లలో నేడు కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

తొలుత డబుల్‌ సెంచరీ
వరుసగా నాలుగో రోజు గురువారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివర్లో డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ 40 పాయింట్లు బలపడి 39,113 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 11,559 వద్ద ముగిసింది. అయితే తొలి సెషన్‌లో సెన్సెక్స్‌ 39,327 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,047 వరకూ వెనకడుగు వేసింది. ఇక నిఫ్టీ 11,617- 11,541 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,527 పాయింట్ల వద్ద, తదుపరి 11,496 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,604 పాయింట్ల వద్ద, ఆపై 11,649 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,475 పాయింట్ల వద్ద, తదుపరి 23,350 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,715 పాయింట్ల వద్ద, తదుపరి 23,829 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,164 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 809 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక బుధవారం ఎఫ్‌పీఐలు 1,581 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  డీఐఐలు రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

మరిన్ని వార్తలు