నేడు లాభాల ఓపెనింగ్‌!

1 Sep, 2020 08:25 IST|Sakshi

71 పాయింట్లు ఎగసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

నిఫ్టీకి 11,679-11,971 వద్ద రెసిస్టెన్స్‌!

సోమవారం విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు

రికార్డ్‌ గరిష్టాల నుంచి యూఎస్‌ మార్కెట్లు డీలా

అటూఇటుగా కదులుతున్న ఆసియా మార్కెట్లు

చైనాతో తిరిగి సైనిక వివాదం తలెత్తిన వార్తలతో ముందురోజు కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు (1న) బౌన్స్‌బ్యాక్‌ అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 71 పాయింట్లు ఎగసి 11,431 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,360 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో దాదాపు 24 శాతం పతనంకావడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే  రెండో క్వార్టర్‌నుంచీ జీడీపీ  పుంజుకోనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. కాగా.. సోమవారం యూఎస్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల నుంచి డీలాపడగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా నేడు కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమ్మకాల షాక్‌
చైనా సైనిక బలగాలు తిరిగి 'హద్దు' మీరినట్లు వెలువడిన వార్తలు సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బ తీశాయి. సెన్సెక్స్‌ 839 పాయింట్లు పతనమై 38,628 వద్ద నిలవగా.. నిఫ్టీ 195 పాయింట్లు కోల్పోయి 11,452 వద్ద ముగిసింది. అయితే తొలుత సెన్సెక్స్‌ 540 పాయింట్లకుపైగా జంప్‌చేసి 40,010 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ స్థాయి నుంచి అమ్మకాలు వెల్లువెత్తడంతో 38,396 దిగువకు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 11,794 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,326 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,211 పాయింట్ల వద్ద, తదుపరి 11,034 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,679 పాయింట్ల వద్ద, ఆపై 11,971 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,016 పాయింట్ల వద్ద, తదుపరి 22,277 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,863 పాయింట్ల వద్ద, తదుపరి 25,971 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1004 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 544 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.  

మరిన్ని వార్తలు