మరోసారి మార్కెట్లకు దివాలీ జోష్‌?!

17 Nov, 2020 08:44 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 98 పాయింట్లు అప్‌

నిఫ్టీకి 12,823-12,865 వద్ద రెసిస్టెన్స్‌!

రికార్డ్‌ గరిష్టాలకు యూఎస్‌ మార్కెట్లు

ప్రస్తుతం అటూఇటుగా ఆసియా మార్కెట్లు

ఈ నెలలో ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు

ముంబై: దీపావళి జోష్‌ను చూపిస్తూ నేడు (17న) మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు  హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 98 పాయింట్లు ఎగసి 12,880 వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్‌ ఫ్యూచర్స్‌ 12,782 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై ఆశలతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 1.2-0.8 శాతం మధ్య ఎగశాయి. సరికొత్త గరిష్టాలవద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. 

ముహూరత్‌ అదుర్స్‌
సరికొత్త ఏడాది సంవత్‌ 2077 తొలి రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. శనివారం సెన్సెక్స్‌, నిఫ్టీ లైఫ్‌టైమ్‌ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్‌ ట్రేడింగ్‌లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,744 పాయింట్ల వద్ద, తదుపరి 12,707 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,823 పాయింట్ల వద్ద, ఆపై 12,865 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 28,433 పాయింట్ల వద్ద, తదుపరి 28,272 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 28,754 పాయింట్ల వద్ద, తదుపరి 28,913 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో శనివారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 78.5 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  డీఐఐలు రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. కాగా.. ఈ నెలలో 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం విశేషం!

మరిన్ని వార్తలు