నేడు లాభాల ఓపెనింగ్‌- తదుపరి?

28 Jul, 2020 08:38 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 60 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,209-11,285 వద్ద రెసిస్టెన్స్‌

సోమవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం లాభాల్లో ఆసియా మార్కెట్లు 

నేడు (28న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 11,175 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 11,115 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు ఆదుకోవడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.4-1.7 శాతం మధ్య పుంజుకున్నాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ఇక ప్రస్తుతం ఆసియాలో దాదాపు మార్కెట్లన్నీ లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా మొదలుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తదుపరి తదుపరి ఆటుపోట్లకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు.

బ్యాంకింగ్‌ షాక్
కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన పలు సవాళ్లతో బ్యాంకింగ్‌ రంగ సమస్యలను ఎదుర్కోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్‌ అభిప్రాయపడింది. ఈ మార్చి నుంచి 2021 మార్చి వరకూ వాణిజ్య బ్యాంకుల జీఎన్‌పీఏలు 8.5 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది.  ఈ నేపథ్యంలో సోమవారం బ్యాంకింగ్ రంగ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 194 పాయింట్లు క్షీణించి 37,935 వద్ద నిలవగా.. నిఫ్టీ 62 పాయింట్ల వెనకడుగుతో 11,132 వద్ద ముగిసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,071 పాయింట్ల వద్ద, తదుపరి 11,011 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,209 పాయింట్ల వద్ద, ఆపై 11,285 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,544 పాయింట్ల వద్ద, తదుపరి 21,239 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,411 పాయింట్ల వద్ద, తదుపరి 22,973 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అమ్మకాలవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 453 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 978 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.  వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 410 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..   డీఐఐలు రూ. 1003 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు