నేడు సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌!

29 Jul, 2020 08:31 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,362-11,423 వద్ద రెసిస్టెన్స్‌

మంగళవారం యూఎస్‌ మార్కెట్లు డౌన్‌‌

ప్రస్తుతం అటూఇటుగా ఆసియా మార్కెట్లు 

నేడు (29న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు బలపడి 11,320 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 11,299 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా 3ఎం తదితర బ్లూచిప్స్‌లో అమ్మకాలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 0.7-1.3 శాతం మధ్య క్షీణించాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. నేడు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా మొదలుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తదుపరి ఆటుపోట్లకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు.

ఆటో, ఐటీ స్పీడ్
కొద్ది రోజుల కన్సాలిడేషన్‌ అనంతరం తిరిగి మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి.  సెన్సెక్స్‌ 558 పాయింట్లు జంప్‌చేసింది. 38,493 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 11,300 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,555 వద్ద గరిష్టాన్ని చేరగా.. 37,998 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదేవిధంగా నిఫ్టీ 11,318- 11,151 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,195 పాయింట్ల వద్ద, తదుపరి 11,090 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,362 పాయింట్ల వద్ద, ఆపై 11,423 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,733 పాయింట్ల వద్ద, తదుపరి 21,362 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,355 పాయింట్ల వద్ద, తదుపరి 22,605 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 246 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 453 కోట్లు, దేశీ ఫండ్స్‌  రూ. 978 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.   

మరిన్ని వార్తలు