నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌!

10 Aug, 2020 08:25 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,250-11,286 వద్ద రెసిస్టెన్స్

‌ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు మిశ్రమం

నేడు (10న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,252 వద్ద ట్రేడవుతోంది.  శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,226 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. యాపిల్‌ తదితర దిగ్గజాలు వెనకడుగు వేయడంతో శుక్రవారం నాస్‌డాక్‌ 0.7 నష్టపోగా.. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ స్వల్పంగా లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దీంతో నేడు మార్కెట్లు యథాప్రకారం ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అక్కడక్కడే
వారాంతాన ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 38,040 వద్ద నిలవగా.. నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 11,214 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,110 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,787 వద్ద కనిష్టాన్ని చేరింది. ఇదే విధంగా నిఫ్టీ 11,232- 11,142 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,160 పాయింట్ల వద్ద, తదుపరి 11,106 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,250 పాయింట్ల వద్ద, ఆపై 11,286 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,541 పాయింట్ల వద్ద, తదుపరి 21,328 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,877 పాయింట్ల వద్ద, తదుపరి 22,000 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 397 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 637 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  డీఐఐలు రూ. 468 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న  విషయం విదితమే. 

మరిన్ని వార్తలు