నేడు స్వల్ప నష్టాలతో ఓపెనింగ్‌?!

6 Aug, 2020 08:32 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 19 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 11,035-10,969 వద్ద సపోర్ట్స్‌

బుధవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

నేడు (6న) రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలను ప్రకటించనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  19  పాయింట్ల స్వల్ప నష్టంతో 11,113 వద్ద ట్రేడవుతోంది.  బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,132 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 సవాళ్ల నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు. కాగా.. బుధవారం యూఎస్‌ మార్కెట్లు 0.3-1.2 శాతం మధ్య బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమ ధోరణిలో కదులుతున్నాయి.

చివరికి అటూఇటుగా
వరుసగా రెండో రోజు బుధవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అటూఇటుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 25 పాయింట్ల స్వల్ప నష్టంతో 37,663 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,102 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. 38,140 వద్ద గరిష్టాన్ని తాకింది. తదుపరి 37,551 పాయింట్ల దిగువన కనిష్టాన్ని తాకింది. ఇదే విధంగా నిఫ్టీ 11,226- 11,064 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,035 పాయింట్ల వద్ద, తదుపరి 10,969 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,196 పాయింట్ల వద్ద, ఆపై 11,292 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,327 పాయింట్ల వద్ద, తదుపరి 21,143 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,815 పాయింట్ల వద్ద, తదుపరి 22,120 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 60 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 426 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 666 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు