నష్టాలతో నేడు మార్కెట్ల ఓపెనింగ్‌!

12 Aug, 2020 08:20 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 102 పాయింట్లు పతనం

నిఫ్టీకి 11,290-11,257 వద్ద సపోర్ట్స్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నేలచూపులో

ప్యాకేజీపై డౌట్‌- యూఎస్‌ మార్కెట్లు డీలా

నేడు (12న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.10 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 102 పాయింట్లు పతనమై 11,242 వద్ద ట్రేడవుతోంది.  మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,344 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో 0.4-1.7 శాతం మధ్య ఇండెక్సులు నష్టపోయాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అత్యధిక శాతం మార్కెట్లు ప్రతికూలంగా కదులుతున్నాయి. దీంతో నేడు మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

నాలుగో రోజూ..
వరుసగా నాలుగో రోజు మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 225 పాయింట్లు ఎగసి 38,407 వద్ద నిలవగా.. 52 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,322 వద్ద ముగిసింది. మిడ్‌సెషన్‌లో సెన్సెక్స్‌ 38,313కు వెనకడుగు వేసినప్పటికీ ఒక దశలో 38,556 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదే విధంగా నిఫ్టీ 11,374- 11,299 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,290 పాయింట్ల వద్ద, తదుపరి 11,257 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,364 పాయింట్ల వద్ద, ఆపై 11,406 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,085 పాయింట్ల వద్ద, తదుపరి 21,944 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,323 పాయింట్ల వద్ద, తదుపరి 22,419 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు