నేడు మార్కెట్ల వెనకడుగు?!

20 Oct, 2020 08:29 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 42 పాయింట్లు డౌన్‌

నిఫ్టీకి 11,830-11,786 వద్ద సపోర్ట్స్‌!

1.5 శాతం నష్టపోయిన యూఎస్‌ మార్కెట్లు

నేలచూపుతో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

నేడు (20న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 11,855 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,897 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. నిరుద్యోగులు, చిన్న సంస్థలకు అండగా ప్రతిపాదిస్తున్న సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో నష్టపోయాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం నేలచూపులతో కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రెండు రోజులుగా దేశీ మార్కెట్లు జోరందుకున్న సంగతి తెలిసిందే.

సెన్సెక్స్‌ హైజంప్
సోమవారం మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో రోజంతా సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల మార్క్‌ ఎగువనే కదిలింది. చివరికి 449 పాయింట్లు జమ చేసుకుని 40,432 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 111 పాయింట్లు జంప్‌చేసి 11,873 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,519 వద్ద, నిఫ్టీ 11,898 వద్ద గరిష్టాలను తాకాయి.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,830 పాయింట్ల వద్ద, తదుపరి 11,786 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,907 పాయింట్ల వద్ద, ఆపై 11,942 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,907 పాయింట్ల వద్ద, తదుపరి 23,548 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,474 పాయింట్ల వద్ద, తదుపరి 24,680 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,622 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం  ఎఫ్‌పీఐలు రూ. 480 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు సైతం రూ. 430 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు