ఎకానమీ సవాళ్లను పరిష్కరించాలి!

25 Feb, 2023 08:24 IST|Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌ ఇటీవలి నెలల్లో మెరుగుపడినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. గ్లోబల్‌ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు, ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను దృఢ సంకల్పంతో పరిష్కరించాలని కూడా జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. జీ20 ఆర్థిక మంత్రులు,  సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీసీ) ప్రారంభ సమావేశంలో దాస్‌ చేసిన ప్రసంగ ముఖ్యాంశాలు..

► ప్రపంచం తీవ్ర మాంద్యం నుండి తప్పించుకోవచ్చని,   వృద్ధి మందగమనం లేదా అంతగా తీవ్రత లేని మాంద్యం పరిస్థితులే సంభవించవచ్చని ఇప్పుడు గొప్ప ఆశావాదం ఉంది. అయితే, ఇంకా అనిశ్చిత పరిస్థితులు మన ముందు ఉన్నాయి.  

►మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను మనం కలిసికట్టుగా దృఢంగా పరిష్కరించాలి. ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు, రుణ ఇబ్బందులు, క్లైమాట్‌ ఫైనాన్స్, వాణిజ్య రంగంలో పరస్పర సహకారం లోపించడం, గ్లోబల్‌ సరఫరాల సమస్యలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పటిష్ట ప్రపంచ ఆర్థిక సహకారంతో ప్రపంచ వృద్ధి విస్తృత స్థాయిలో మెరుగుపరచడం సాధ్యమవుతుంది.  

► జీ20 గ్రూప్‌ ప్రస్తుతం పరివర్తన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి జీ20 ఒక బహుపాక్షిక ఫోరమ్‌గా అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది.   

మరిన్ని వార్తలు