డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సరైన తరుణం ఏది?

1 Aug, 2022 08:49 IST|Sakshi

మార్కెట్లు పడినప్పుడు ఈక్విటీ ఫండ్స్‌ యూనిట్లు కొనుగోలు చేసినట్టుగానే.. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుకూల సమయం ఏది?
 డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునే ముందు, లంప్‌ సమ్‌ (ఒకే విడత మొత్తం) అయినా సరే.. మీ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఫథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది కీలకమవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మీరు ఎంపిక చేసుకున్న పథకం రక్షణ ఎక్కువగా ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసేలా ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేసే మాదిరి అని అన్నారు. కానీ, అదేమంత సులభం కాదు.

ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నప్పుడు దిద్దుబాటు చివరికి వచ్చిందా.. ఇంకా కరెక్షన్‌ మిగిలి ఉన్నదా అన్నది మీకు తెలియదు. అందుకని ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఆచరించాలని చెబుతుంటాను. మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే కొంత మొత్తాన్ని మార్కెట్లు పడినప్పుడు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవచ్చు. కనిష్ట స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టడం వల్ల మంచిగా పెరిగే వాటిల్లో పెట్టుబడుల అవకాశాలను కోల్పోవచ్చు. 

నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉంటే, 30 శాతం ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (డెట్‌) పథకాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్విటీ పెట్టుబడుల్లో 10 శాతాన్ని తీసుకెళ్లి రీట్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి రాబడులు సెన్సెక్స్‌ను అధిగమిస్తాయా?   
రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌ఈఐటీ/రీట్‌)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్‌ చస్తుంటాయి. వీటి అద్దె రాబడులు అన్నవి ప్రస్తుతం అంత ఎక్కువేమీ లేవు. వచ్చే పదేళ్లలో కొంత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ప్రస్తుతం చూస్తున్న మాదిరి ప్రతికూలతలు మధ్యలో ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ, సెన్సెక్స్‌ పట్ల నేను ఎంతో ఆశావహంతో ఉన్నాను.   రీట్‌ల కంటే సెన్సెక్స్‌ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను.

ప్రతి నెలా ఫండ్స్‌లో రూ.50,000కు మించి పెట్టుబడులు పెట్టేట్టు అయితే పథకాల విభజన ఎలా?
ప్రతి నెలా రూ.50,000తో ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కానీ, పోర్ట్‌ఫోలియో సరళంగా ఉండేలా చూసుకోవాలన్నది నా సూచన. రెండు మంచి ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు సరిపోతాయి. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే, రెండు ఫ్లెక్సీక్యాప్‌ పథకాలకు తోడు, రెండు స్మాల్‌క్యాప్‌ పథకాలను కూడా చేర్చుకోండి. పెట్టుబడులు సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. 

చదవండి: ఇలాంటి పాన్‌ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ!

మరిన్ని వార్తలు