రెండోరోజూ బుల్‌ సందడి

6 Oct, 2021 01:19 IST|Sakshi

సెన్సెక్స్‌ లాభం 446 పాయింట్లు  

17,800 పైన ముగిసిన నిఫ్టీ  

రాణించిన ఇంధన, ఐటీ, ఆర్థిక షేర్లు 

ఫార్మా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు  

మరోసారి జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద

ముంబై: స్టాక్‌ మార్కెట్లో రెండోరోజూ బుల్‌ సందడి చేసింది. ఇంధన, ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు బ్యాంకింగ్‌ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 446 పాయింట్లు పెరిగి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 17,822 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితులు, బాండ్, ఫారెక్స్‌ మార్కెట్లలో అస్థిరతలను విస్మరిస్తూ కొనుగోళ్లకే కట్టుబడ్డారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో ఇంధన షేర్లకు, డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత ఐటీ షేర్లకు కలిసొచ్చింది.

అయితే ఫార్మా, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.చిన్న, మధ్య తరహా షేర్లలో ఓ మోస్తారు కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు అర శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లలో 10 షేర్లు నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1915 కోట్ల షేర్లను అమ్మగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1868 కోట్ల షేర్లను కొన్నారు. క్రూడాయిల్‌ ధరల ప్రభావంతో ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. టెక్నాలజీ షేర్లు రికవరీతో యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. 

ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగింపు...
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్‌ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 59,320 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 17,661 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రపంచ మార్కెట్లోని ప్రతికూలతలతో సూచీలు ఆరంభంలో తడబడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలో వెంటనే కోలుకున్నాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో సేవల రంగ నెమ్మదించినా.., గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలను అందుకోవడం మార్కెట్‌ వర్గాలకు ఉత్సాహాన్నిచ్చింది.

యూరప్‌ మార్కెట్ల స్వల్ప లాభాల ప్రారంభంతో కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 479 పాయింట్లు ఎగసి 59,778 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు ర్యాలీ చేసి 17,833 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. మిడ్‌సెషన్‌లోనూ స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు దాదాపు ఇంట్రాడే గరిష్టాల వద్ద ముగిశాయి.  

రెండు రోజుల్లో రూ.5.17 లక్షల కోట్లు...  
స్టాక్‌ సూచీలు వరుస లాభాలతో దూసుకెళ్లడంతో స్టాక్‌ మార్కెట్లో రెండో రోజుల్లో రూ.5.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.265 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 980 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు పెరిగింది.

ప్రభుత్వానికి పీఎస్‌యూల డివిడెండ్లు
ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా చెల్లింపులు 
న్యూఢిల్లీ: ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా నుంచి తాజాగా డివిడెండ్లను అందుకుంది. కోల్‌ ఇండియా రూ. 1,426 కోట్లు, ఓఎన్‌జీసీ రూ. 1,406 కోట్లు చొప్పున ప్రభుత్వానికి చెల్లించినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ఏడాది (2021–22)లో సీపీఎస్‌ఈల నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల రూపేణా రూ. 4,576 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థల(సీపీఎస్‌ఈలు)లో వాటాల విక్రయం ద్వారా రూ. 9,110 కోట్లను సమీకరించినట్లు పేర్కొన్నారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
దాదాపు రూ.300 కోట్ల ఆర్డర్లను దక్కించుకోవడంతో హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేరు 5% ఎగసి అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యింది. షేరు రూ.79 స్థాయి వద్ద స్థిరపడింది.  
కేంద్రం స్పెక్ట్రం వినియోగ ఛార్జీలను తగ్గించడంతో టెలికాం షేర్లు లాభాల మోత మోగించాయి. ఈ రంగానికి చెందిన ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్‌ తదితర కంపెనీల షేర్లు ఐదు శాతం నుంచి 2% లాభపడ్డాయి. 
ఇంధన షేర్లలో ర్యాలీ భాగంగా రిలయన్స్‌ షేరు రాణించింది. బీఎస్‌ఈ ఇంట్రాడేలో రెండు శాతానికి పైగా ఎగసి రూ.2612 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 2% లాభంతో రూ.2609 వద్ద స్థిరపింది. 
చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు నిర్వహణ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్‌బీఐ బోర్డును రద్దు చేయడంతో శ్రేయీ ఇన్‌ఫ్రా షేర్లు ఐదుశాతం నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. 

మరిన్ని వార్తలు