ఆల్‌టైం హై టచ్‌ చేసిన సెన్సెక్స్... స్టాక్‌మార్కెట్‌లో బుల్‌ జోరు

17 Aug, 2021 15:57 IST|Sakshi

ముంబై: స్టాక్‌మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్‌జోరు ఇప్పుడప్పిడే ఆగేలా లేదు. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒడిదుడులకు తట్టుకుంటూ కొత్త ఎత్తులను చేరుతున్నాయి. మంగళవారం రోజు సెన్సెక్స్‌ ఒక దశలో రికార్డు స్థాయిలో పాయింట్లు లాభపడి 55,854 పాయింట్లను టచ్‌ చేసి రికార్డు సృష్టించింది.

కరోనా కట్టడిలో ఉండటంతో పాటు ఆఫ్ఘన్‌ వ్యవహరంలో అమెరికా స్థిరమైన అభిప్రాయానికి కట్టుబడి ఉండటంతో అంతర్జాతీయ సూచీలు స్థిరంగా కదలాడుతున్నాయి. దీనికి దేశీ మార్కెట్‌లో నెలకొన్న సానుకూల వాతావరణం కలిసి వచ్చింది. ఫలితంగా ప్రారంభంలో దేశీ సూచీలు నష్టాలను చవి చూసినా ఎప్పటిలాగే తిరిగి కోలుకుని లాభాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 55,565 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లు కోల్పోతూ 55,386 పాయింట్లను తాకింది. ఇక మార్కెట్‌లో కరెక‌్షన్‌ మొదలైందని అనుకునేలోగా ఒక్కసారిగా పుంజుకుంది. మార్కెట్‌ ముగిసే సమయానికి 209 పాయింట్లు లాభపడి 55,792 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 51 పాయింట్లు లాభపడి 16,614 పాయింట్ల వద్ద ముగిసింది. 

టెక్‌మహీంద్రా, టీసీఎస్‌, నెస్టల్‌ ఇండియా, టైటాన్‌ కంపెనీ, హిందూస్థాన్‌ యూనీలీవర్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ కంపెనీల షేర్లు సెన్సెక్స్‌లో లాభాలు పొందాయి. మరోవైపు ఇండస్‌ఇండ్‌బ్యాంకు, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటాస్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 0.6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఐటీ 2.57 శాతం పెరిగింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు