Eric Demuth: ఒకప్పుడు పడవలకు యాంకర్‌ వేసిన కూలీ.. ఇప్పుడు యూరప్‌ను శాసించే క్రిప్టో ట్రేడర్‌

23 Aug, 2021 14:47 IST|Sakshi

Bitpanda CEO Eric Demuth Success Story: ‘ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది’.. ఇదే జరిగింది ఎరిక్‌ డెమ్యూత్‌(34) లైఫ్‌లో. వృథా ఖర్చులకు వెనుకాడే ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు తన కలను సైతం వదిలేసుకుని.. మరో దారిలోకి దిగాడు. విజయమో.. ఓటమో ఏదో ఒకటి తేల్చుకుని కెరీర్‌లో పోరాడాలనుకున్నాడు. అతని ప్రయత్నానికి అదృష్టం తోడైంది. ఒకప్పుడు జేబులో పాకెట్‌ మనీకి మూడు డాలర్లు పెట్టుకుని తిరిగిన కుర్రాడు.. ఇప్పుడు  మిలియన్ల సంపదతో యూరప్‌ను శాసించే క్రిప్టో ట్రేడర్‌గా ఎదిగాడు మరి.
   

బిట్‌పాండా.. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఓ సంచలనం. యూరప్‌లో క్రిప్టో కరెన్సీని ప్రధానంగా ప్రచారం చేసింది ఇదే. ఆస్ట్రియా-వియన్నా నియోబ్రోకర్‌గా ఉన్న ఈ కంపెనీ.. కామన్‌ పీపుల్‌కు క్రిప్టోకరెన్సీని చేరువచేసింది. డిజిటల్‌ కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్‌,  బిట్‌కాయిన్‌ను హ్యాండిల్‌ చేయడం, డిజిటల్‌ ఆస్తుల కొనుగోలు-అమ్మకం, గోల్డ్‌ దాచుకోవడం, సేవింగ్స్‌.. ఇలా క్రిప్టో బిజినెస్‌ తీరుతెన్నులను సాధారణ పౌరులకు సైతం అర్థం అయ్యేలా చేసింది బిట్‌పాండా. ఈ ప్రత్యేకత వల్లే ఏడేళ్లు తిరగకుండానే యూరప్‌లో బిట్‌పాండా అగ్రస్థానంలో నిలిచింది.  ప్రస్తుతం బిట్‌పాండా విలువ సుమారు  4.1 బిలియన్‌ డాలర్లపైనే ఉండగా.. అందులో డెమ్యూత్‌ వాటా దాదాపు 820 మిలియన్ల డాలర్లు. 

కష్టజీవి
వియన్నాకి చెందిన ఎరిక్‌ డెమ్యూత్‌ ఓ మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు. చిన్నప్పటి నుంచే పొదుపరిగా ఉండే ఈ కుర్రాడు ఏనాడూ పైసా విదిల్చేవాడు కాదు. పైగా తన చిన్నతనంలో పేరెంట్స్‌ చేసే వృథా ఖర్చులపై నిలదీసేవాడు. అలాంటి ఎరిక్‌కు షిప్‌కు కెప్టెన్‌ కావాలని కల ఉండేది. అందుకే చెప్పాపెట్టకుండా 23 ఏళ్ల వయసులో కంటెయినర్‌ షిప్స్‌ మీద కూలీ పనికి వెళ్లాడు. చైనా, జపాన్‌.. నైరుతి ఆసియా ప్రాంతాల్లో  పని చేశాడు. షిప్‌ కెప్టెన్‌ కావాలన్నది అతని కల. ఆ కల కోసం అలా ఎన్నాళ్లైనా కష్టం భరించాలనుకున్నాడు. ఒక్కపూట తిండి.. చాలిచాలని జీతంతో గడిపాడు. కానీ, రెండున్నరేళ్లు గడిచాక అతని వల్ల కాలేదు. మెకానిక్‌గా, యాంకర్లు వేసే కూలీగా సంచార జీవనం గడపడం అతనికి బోర్‌గా అనిపించింది. అందుకే ఆ ఉద్యోగం వదిలేశాడు. వియన్నాకు తిరిగి వచ్చేశాడు. ఈసారి ఫైనాన్స్‌ చదవులోకి దిగాడు.
 
పౌల్‌ క్లాన్‌స్చెక్‌తో డెమ్యూత్‌

కాళ్లు అరిగేలా తిరిగి, ఒప్పించి.. 
ఫైనాన్స్‌ కోర్స్‌ పూర్తి చేశాక.. డిజిటల్‌ బిజినెస్‌ ఎక్స్‌పర్ట్‌ పౌల్‌ క్లాన్‌స్చెక్‌ను కలిశాడు డెమ్యూత్‌. వీళ్లిద్దరూ మరో ఫైనాన్స్‌ ఎక్స్‌పర్ట్‌ క్రిస్టియన్‌ ట్రమ్మర్‌తో కలిసి క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. పీటర్‌ థెయిల్‌ ‘వాలర్‌’ వెంచర్స్‌ సాయం కోసం ప్రయత్నించారు. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. అయినా టైం వేస్ట్‌ చేయకుండా వాలర్‌ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. వాళ్ల ప్రయత్నం థెయిల్‌ను ఆకట్టుకుంది. కొంతమేర పెట్టుబడులకు ముందుకొచ్చాడు. వారం తిరగకముందే 263 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌తో బిట్‌పాండా కంపెనీ మొదలైంది. ఇందులో డెమ్యూత్‌ ఖర్చు పెట్టకుండా దాచుకున్న సొమ్మంతా కూడా ఉంది. ఫలితం ఎలా ఉన్నా సరే.. ఇదొక బిజినెస్‌ పాఠం కావాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. కట్‌ చేస్తే.. ఏడేళ్లకు యూరప్‌ క్రిప్టో కరెన్సీతో డిజిటల్‌ మార్కెట్‌ను శాసిస్తోంది ఆపరేటింగ్‌ ట్రేడ్‌ ప్లాట్‌ఫామ్‌ బిట్‌పాండా.  


మనిషి జీవితంలో అన్ని అనుకున్నట్లు జరుగుతాయన్న గ్యారెంటీ ఉందా?. ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిగా మిగతా వాళ్లలాగే నాకు సరదాగా ఉండాలని ఉండేది. కానీ, వృథా ఖర్చులతో ఏం ఉపయోగం ఉండదని అర్థం చేసుకున్నా. నా లక్క్ష్యం ఒకటి ఉండేది. అది తప్పినా మరోదారిని ఎంచుకుని విజయం కోసం ప్రయత్నిస్తున్నా.(తనది పూర్తి విజయంగా ఒప్పుకోవట్లేదు డెమ్యూత్‌). నాలాగే చాలామందికి ఏదో సాధించాలనే తాపత్రయం ఉంటుంది. అందరికీ కల నెరవేర్చుకునేందుకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. లేదంటే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అలాంటప్పుడే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నవాళ్లం అవుతాం. - ఎరిక్‌ డెమ్యూత్‌

చదవండి: బిజినెస్‌ పాఠాలు నేర్పిన చిరంజీవి సినిమా తెలుసా?

మరిన్ని వార్తలు