ఇదేం బాదుడు బాబోయ్‌! సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.500

10 Nov, 2021 19:45 IST|Sakshi

పూర్తి స్థాయిలో రైళ్లు ఇంకా పట్టాలు మీద పరుగులు పెట్టడం లేదు.. అప్పుడే పార్కింగ్‌ ఛార్జీల పేరుతో దక్షిణ మధ్య రైల్వే ‍ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతోంది. ముఖ్యంగా జంటనగరాల్లో రైలు ప్రయాణాలకు గుండెకాయలాంటి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు సొంత వాహనంలో రావాలంటే వెన్నులో వణుకుపుట్టే రేంజ్‌లో ఛార్జీలను విధిస్తోంది. ఇదేమంటే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకే అంటూ వితండవాదం ఎత్తుకుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ప్రధానమైంది సికింద్రాబాద్‌ జంక‌్షన్‌. ఈ స్టేషన్‌ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగించుకుంటారు. రద్దీ తగ్గట్టుగా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, పీపీపీ మోడ్‌లో పనులు చేపట్టబోతున్నట్టు ఇన్నాళ్లు ప్రకటిస్తూ వస్తోన్న రైల్వేశాఖ.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామాన్యుల నడ్డీ విరిచేలా పార్కింగ్‌ ఫీజుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోంది.

కేవలం రెండు గంటలే
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కి ఇరువైపులా పార్కింగ్‌ ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడ టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను ప్రయాణికులు నిలిపి ఉంచుతున్నారు. దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్‌ నిలిపి ఉంచితే రూ.15 , ఫోర్‌ వీలర్‌ అయితే రూ.50 వంతున పార్కింగ్‌ ఛార్జీగా విధించింది. 
ఆలస్యమయితే
ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్‌ ప్లేస్‌లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ. రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్‌ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది. అవి చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.
- తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.100
- తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.200
- తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమయితే ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.500

ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ఈ ఎక్స్‌ట్రా పార్కింగ్‌ ఛార్జీలు శరాఘాతంగా మారాయి. పండగ వేళ స్టేషన్‌కి వెళ్లి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జీల కాటుకు గురైన ఎందరో సోషల్‌ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కవరింగ్‌
ఎక్స్‌ట్రా పార్కింగ్‌ ఛార్జీల విషయంలో నలువైపులా విమర్శలు పెరిగినా రైల్వే అధికారుల్లో మార్పు రాలేదు. పైగా స్టేషన్‌లో అనవసర రద్దీని నియంత్రించేందుకు స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యంగా ఉండేందుకే ఈ ఓవర్‌ స్టే ఛార్జీలు పెట్టామంటూ కవరింగ్‌ ఇ‍చ్చే ప్రయత్నం చేస్తోంది. 

ఇలాగైతే ఎలా
రెండు గంటలు దాటితే రైల్వేశాఖ అమలు చేస్తోన్న ఓవర్‌ స్టే ఛార్జీలు తమకు భారంగా మారాయని ప్రయాణికులు అంటున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేలా ప్రయాణం చేయడం కష్టంగా అవుతోంది అంటున్నారు. మరోవైపు చాలా రైళ్లు సమయానికి రావు. ఒక వేళ రైలు ఆలస్యం కావడం వల్ల స్టేషన్‌లో ఎక​‍్కువ సేపు ఉండాల్సి వస్తే.. అది రైల్వేశాఖ తప్పు అవుతుంది. అందుకు వాళ్లే పరిహారం ఇవ్వాల్సింది పోయి.. తిరిగి ప్రజల నుంచి ఓవర్‌ స్టే ఛార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అక్కడ స్పెషల్‌.. ఇక్కడ ఓవర్‌స్టే
కోవిడ్‌ తర్వాత సాధారణ రైళ్లను క్రమంగా పట్టాలెక్కుతున్నాయి. అయితే వాటిని సాధారణ రైళ్లుగా కాకుండా స్పెషల్‌ రైళ్లుగా పేర్కొంటూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది రైల్వేశాఖ. కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి.. అక్కడ కూడా సొమ్ము చేసుకుంటోంది. వీటిపైనే చాలా విమర్శలు ఉండగా తాజాగా పార్కింగ్‌ ఓవర్‌స్టే ఛార్జీలు తెర మీదకు వచ్చాయి.
 

మరిన్ని వార్తలు