శ్రీరామ్‌ చేతికి సువిలాస్‌ రియల్టీస్‌

26 Nov, 2022 05:53 IST|Sakshi

100 శాతం వాటా కొనుగోలు

న్యూఢిల్లీ: సుమారు రూ. 400 కోట్ల విలువైన హౌసింగ్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సువిలాస్‌ రియల్టీస్‌ సంస్థను సొంతం చేసుకున్నట్లు రియల్టీ రంగ కంపెనీ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పేర్కొంది. పూర్తి అనుబంధ సంస్థ శ్రీప్రాప్‌ బిల్డర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ద్వారా 100 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది. సువిలాస్‌ ప్రస్తుతం 0.65 మిలియన్‌ చదరపు అడుగుల రెసిడెన్షియల్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. బెంగళూరులోని జలహళ్లిలో శ్రీరామ్‌ సువిలాస్‌ పామ్స్‌ బ్రాండుతో 6.9 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టింది.

శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌తో కుదుర్చుకున్న అభివృద్ధి నిర్వహణా కాంట్రాక్టు ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రస్తుత ప్రమోటర్లు తొలి దశలోనే మానిటైజ్‌కు తెరతీసింది. ఈ ప్రాంతానికున్న అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే బాటలో శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ ప్రాజెక్టును కొనుగోలు చేసింది. కాగా.. మరోపక్క సువిలాస్‌కే చెందిన మరో ప్రాజెక్టు శ్రీరామ్‌ సువిలాస్‌ గార్డెన్‌ ఆఫ్‌ జాయ్‌ను సైతం విడిగా చేజిక్కించుకున్నట్లు శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ వెల్లడించింది. 152 యూనిట్లతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుకు 0.2 మిలియన్‌ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్నట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు