వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది

15 Jul, 2021 08:39 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన విక్రయాలు తిరిగి గాడినపడుతున్నాయి. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ఆటోమొబైల్‌ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం.. జూన్‌ నెల దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ కలిపి 12,96,807 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14.7 శాతం వృద్ధి. ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 1,05,617 నుంచి 2,31,633 యూనిట్లకు ఎగిశాయి. ద్విచక్ర వాహనాలు 10,14,827 నుంచి 10,55,777 యూనిట్లకు చేరాయి. గత నెలలో త్రీ వీలర్లు 9,397 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 జూన్‌లో ఈ సంఖ్య 10,300 యూనిట్లు నమోదైంది.  

తొలి త్రైమాసికంలో ఇలా.. 
ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌లో వాహన అమ్మకాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా నమోదయ్యాయి. ఈ కాలంలో భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి 31,80,039 వెహికిల్స్‌ విక్రయమయ్యాయి. కోవిడ్‌–19 దెబ్బతో 2020–21 తొలి త్రైమాసికంలో ఈ సంఖ్య 14,92,612 యూనిట్లకు పరిమితమైంది. ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 1,53,734 నుంచి 6,46,272 యూనిట్లకు పెరిగాయి. ద్విచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 24 లక్షల యూనిట్లకు చేరాయి. కమర్షియల్‌ వెహికిల్స్‌ మూడు రెట్లు అధికమై 1,05,800 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు రెండింతలై 24,376 యూనిట్లకు చేరుకున్నాయి.   

చదవండి: ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద‍్యోగాలు, లక్షల్లో వేతనాలు


 

మరిన్ని వార్తలు