గొల్లభామ చీరలు.. ఇంటి నుంచే కొనేయచ్చు

8 Aug, 2021 10:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేనేత వస్త్రాల్లో సిద్దిపేట గొల్లభామ చీరలది ప్రత్యేకమైన స్థానం. ఇకపై ఆ చీరలు కొనాలంటే సిద్దిపేటకు వెళ్లక్కర్లేదు. మరేషాప్‌కి పోనక్కర్లేదు. ఇంట్లో ఉండే ఏంచక్కా ఆ చీరలను పొందవచ్చు. పోస్టల్‌ శాఖకు చెందిన ఈ షాప్‌ పోర్టల్‌ ద్వారా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ చీరలను బుక్‌ చేసుకుని హోం డెలివరీ పొందవచ్చు. 

ఈ షాప్‌
జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) ట్యాగ్‌కలిగిన తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్‌ రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్లతోపాటు ఆ శాఖ ఈ కామర్స్‌ వెబ్‌పోర్టల్‌ ‘ఈ–షాప్‌’ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు.  తెలంగాణలోని హస్తకళల ఉత్పత్తులు, జీఐ ట్యాగ్‌ ఉత్పత్తుల విక్రయాల కోసం పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో ఏచ్పాటు చేసిన ప్రత్యేక ఈ కామర్స్‌ పోర్టల్‌ (www.eshop.tsposts.in) ను  గవర్నర్‌ తమిళసై  ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ చేసిన కృషిని గవర్నర్‌ అభినందించారు. నిర్మల్‌ కొయ్యబొమ్మలు, వరంగల్‌ రగ్గులు, నారాయణపేట చేనేత చీరలు, హైదరాబాద్‌ హలీమ్, సిద్దిపేట గొల్లభామ చీరలపై రూపొందించిన పోస్టల్‌ కవర్లను గవర్నర్‌ తాజాగా ఆవిష్కరించారు. ప్రస్తుతం జీఐ ట్యాగ్‌కి సంబంధించి గొల్లభామ చీరలు ఈ షాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

పోస్టల్‌ కవర్లు 
భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరహక్కుల పరిరక్షణ కోసం వాటికి జీఐ ట్యాగ్‌ హోదాను కల్పిస్తున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన 13 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌ హోదా లభించగా, ఇందులో ఐదు ఉత్పత్తులపై ప్రత్యేక పోస్టర్‌ కవర్లను పోస్టల్‌ శాఖ తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు