మస్క్‌ రాంగ్‌ ‘సిగ్నల్‌’.. షేరు పరుగు!

12 Jan, 2021 05:30 IST|Sakshi

ఎలాన్‌ మస్క్‌ మాటతో సిగ్నల్‌ షేరు రయ్‌

2 రోజుల్లో 600 శాతం జంప్‌...

కానీ, మస్క్‌ చెప్పిన కంపెనీ వేరు.. పెరిగిన షేరు వేరు!

ఒక శక్తివంతమైన మాట.. కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తుంటుంది. ఇందుకు టెస్లా చీఫ్‌ ఎలన్‌ మస్క్‌.. వాట్సాప్‌.. సిగ్నల్‌ ఉదంతమే నిదర్శనం. మెసేజింగ్‌ కోసం సిగ్నల్‌ యాప్‌ను వాడాలంటూ మస్క్‌ ఇచ్చిన పిలుపుతో సిగ్నల్‌ షేరు భారీ స్థాయిలో ఎగిసింది. కానీ, చిత్రమేమిటంటే.. మస్క్‌ చెప్పిన సిగ్నల్‌ అనే కంపెనీ అసలు స్టాక్‌ ఎక్సే్ఛంజీల్లోనే లిస్టే కాలేదు. వాస్తవానికి ఈ సిగ్నల్‌కు దక్కాల్సిన క్రెడిట్‌ అంతా అదే పేరున్న మరో లిస్టెడ్‌ కంపెనీకి దక్కింది. వివరాల్లోకి వెళితే..

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవలే తన ప్రైవసీ నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. వీటి ప్రకారం యూజర్లకు సంబంధించిన పలు వివరాలను అది మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కూడా పంచుకోనుంది. ఇందుకు సమ్మతించిన యూజర్లకు మాత్రమే తమ యాప్‌ అందుబాటులో ఉంటుందని వాట్సాప్‌ స్పష్టం చేసింది. సాధారణంగానే వ్యక్తిగత వివరాల గోప్యతకు ప్రాధాన్యమిచ్చే యూజర్లకు ఈ కొత్త నిబంధనను చూస్తే చిర్రెత్తుకొచ్చింది. ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ కూడా ఇలాంటి యూజర్లలో ఒకరు. వాట్సాప్‌కు గుడ్‌బై చెప్పి ఇలాంటి ప్రైవసీ నిబంధనల బాదరబందీ లేని సిగ్నల్‌ అనే యాప్‌కు మారిపోవాలంటూ పిలుపునిచ్చారు. దీంతో సిగ్నల్‌ యాప్‌ డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దెబ్బతో యూజర్లు చేజారకుండా చూసుకునేందుకు వాట్సాప్‌ పలు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. యాప్‌లకు సంబంధించి ఇక్కడి వరకూ కథ బాగానే ఉన్నప్పటికీ.. ఈ నాలుగైదు రోజుల్లో అమెరికన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది.

అడ్వాన్స్‌ షేరు రయ్‌...
మస్క్‌ చెప్పిన సిగ్నల్‌ అనేది ఒక లాభాపేక్ష లేని ఓ సంస్థ నిర్వహణలోని మెసేజింగ్‌ యాప్‌. వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్, టెలిగ్రాం వంటి వాటికి ప్రత్యామ్నాయం మాత్రమే. దీనికి స్టాక్‌ ఎక్సే్చంజీలకు సంబంధం లేదు. అయితే, ఇదే పేరుతో సిగ్నల్‌ అడ్వాన్స్‌ అనే మరో లిస్టెడ్‌ కంపెనీ ఉంది. మస్క్‌ సూచించిన సిగ్నల్‌ ఇదే అయి ఉంటుందనుకున్న స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు.. సిగ్నల్‌ అడ్వాన్సెస్‌ షేరు కోసం ఎగబడ్డారు. దీంతో ఆ షేరు ఒకే రోజు ఏకంగా 527 శాతం ఎగిసింది. ఆ తర్వాత రోజు మరో 91 శాతం పెరిగింది. దీంతో ఆరేళ్లుగా ఏనాడు 1 డాలరు మార్కు కూడా దాటని సిగ్నల్‌ అడ్వాన్స్‌ షేరు ధర 60 సెంట్ల స్థాయి నుంచి ఏకంగా 7.19 డాలర్లకు దూసుకెళ్లిపోయింది. మార్కెట్‌ క్యాప్‌ 55 మిలియన్‌ డాలర్ల నుంచి అమాంతంగా 600 మిలియన్‌ డాలర్లకు ఎగిసింది. చివరికి సదరు సిగ్నల్‌ అడ్వాన్స్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని సిగ్నల్‌ మెసేజింగ్‌ యాప్‌ స్వయంగా వివరణ ఇచ్చుకుంటే తప్ప షేరు పరుగు ఆగలేదు.

గతంలోనూ..
ఇలా ఇన్వెస్టర్లు ఒక కంపెనీ బదులు మరో కంపెనీ షేరు కోసం ఎగబడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జూమ్‌ వీడియో కమ్యూనికేషన్‌ అనే సంస్థ లిస్టయిన రోజున దాదాపు అలాంటి పేరే ఉన్న జూమ్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీ షేరు .. రెండు గంటల వ్యవధిలో 80 శాతం పైగా ఎగిసింది. అయితే, తేడా తెలిసిన తర్వాత అదంతా తగ్గిపోయి చివరికి 10 శాతం లాభంతో క్లోజయ్యింది. ఇక మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ట్విట్టర్‌ లిస్టింగ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న మార్కెట్‌ వర్గాలు ట్వీట్టర్‌ హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌ అనే సంస్థ షేర్లను ఎడాపెడా కొనేశారు. దీంతో దాని షేరు 1,000 శాతం పైగా పెరిగిపోయింది.

మరిన్ని వార్తలు