రిలయన్స్‌ రిటైల్‌లో.. సిల్వర్‌ లేక్

9 Sep, 2020 10:01 IST|Sakshi

1.75 శాతం వాటా కొనుగోలుకి ఆర్‌ఐఎల్‌తో డీల్‌

వాటా విలువ రూ. 7,500 కోట్లు

రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ. 4.2 లక్షల కోట్లకు

ఈకామర్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా జియో మార్ట్‌

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్‌ లేక్‌ స్వల్ప వాటాను కొనుగోలు చేయనుంది. 1.75 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిల్వర్‌ లేక్‌ డీల్‌ కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్‌ తాజాగా వెల్లడించింది. ఇందుకు సిల్వర్‌లేక్‌ రూ. 7,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌తో రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్‌ అనుబంధ విభాగమైన రిలయన్స్‌ జియోలో సైతం సిల్వర్‌ లేక్‌ ఇన్వెస్ట్‌ చేసింది. 

నిధుల సమీకరణ
డిజిటల్‌ అనుబంధ విభాగం రిలయన్స్‌ జియో బాటలో రిలయన్స్‌ రిటైల్‌లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్‌ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వృద్ధి కోసం ఆర్‌ఐఎల్‌ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశాయి. రిలయన్స్‌ జియోలో ఇప్పటికే సిల్వర్‌ లేక్‌ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. రిలయన్స్‌ జియోలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలకు రిలయన్స్‌ రిటైల్‌లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్‌ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. 

కన్సాలిడేషన్‌
గత నెలలో కిశోర్‌ బియానీ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌ బిజినెస్‌లను ముకేశ్‌ అంబానీ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్‌ రంగంలో కన్సాలిడేషన్‌ ద్వారా రిలయన్స్ గ్రూప్‌..  రిటైల్‌ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌(వాల్‌మార్ట్‌)కు పోటీగా జియో మార్ట్‌ ద్వారా రిలయన్స్‌ రిటైల్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్‌ రిటైల్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు