రిలయన్స్‌ రిటైల్‌లో సిల్వర్‌ లేక్‌ పెట్టుబడులు!

5 Sep, 2020 04:40 IST|Sakshi

రూ.7,400 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే అవకాశం

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌లో వంద కోట్ల డాలర్లు (రూ.7,400 కోట్లు ) పెట్టుబడులు పెట్టాలని అమెరికా ప్రైవేట్‌ ఈక్విటీ  సంస్థ సిల్వర్‌ లేక్‌ యోచిస్తోందని సమాచారం. రిలయన్స్‌ రిటైల్‌లో  వాటా కోసం సిల్వర్‌ లేక్‌ పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై ఇరు సంస్థలు ఇప్పటివరకూ ఎలాంటి స్పందన  వ్యక్తం చేయలేదు. రిలయన్స్‌ రిటైల్‌ విలువ 5,700 కోట్ల డాలర్ల(రూ.4.2 లక్షల కోట్ల) మేర ఉంటుందని అంచనా.  

ఇప్పుడు రిలయన్స్‌ రిటైల్‌ వంతు...
రిలయన్స్‌ జియోలో వాటాలను విజయవంతంగా విక్రయించిన తర్వాత ఇప్పుడు ముకేశ్‌ అంబానీ రిటైల్‌ విభాగంలో వాటా విక్రయంపై దృష్టిసారించారు. కాగా గత వారమే రిలయన్స్‌ కంపెనీ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్‌ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా రిలయన్స్‌ జియోలో సిల్వర్‌ లేక్‌ సంస్థ రెండు దఫాలుగా 2.08 శాతం వాటా కోసం రూ.10,203 కోట్ల పెట్టుబడులు పెట్టింది. జియోలో ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీలకు రిలయన్స్‌ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయాలన్న ఆఫర్‌ లభించిందని, దీనిపై ఆ సంస్థలు కసరత్తు చేస్తున్నాయని సమాచారం.

మరిన్ని వార్తలు