ఓలా, ఏథ‌ర్ స్కూటర్లకి పోటీగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్!

21 Jul, 2021 19:33 IST|Sakshi

దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రజల ఆసక్తికి అనుగుణంగా చాలా కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి పోటీపడుతున్నాయి. తాజాగా ఓలా, ఏథ‌ర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా మరో కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొనిరావడానికి సిద్దం అవుతుంది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ ఆగస్టు 15న తన మొదటి ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సింపుల్ ఎనర్జీ ఈ నెల ప్రారంభంలో 'సింపుల్ వన్' పేరుతో ఒక స్కూటర్ ను ట్రేడ్ మార్క్ చేసింది. ఇంతకు ముందు దీనికి మార్క్2 అని పేరు పెట్టారు. 

"సింపుల్ ఎనర్జీ ద్వారా మొదటి ఎలక్ట్రిక్ వాహనం పేరును ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సింపుల్ వన్ అనే పేరు బ్రాండ్, ప్రొడక్ట్ కు సంభందించి సరైన అర్ధాన్ని ఇస్తుంది" అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. దీనిని ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్ లో 240 కిలోమీటర్ల వెళ్లవచ్చు అని సంస్థ క్లెయిమ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా, ఏథ‌ర్ స్కూటర్లకి పోటీగా నిలవనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని తొలగించడానికి అవకాశం ఉంది. ఈ స్కూటర్ 3.6 సెకన్లలో గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. దీని గంటకు 100 కిలోమీటర్లు అత్యదిక వేగంతో వెళ్లనున్నట్లు సంస్థ పేర్కొంది. దీని ధర కూడా రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండవచ్చని కంపెనీ సూచించింది. అలాగే, కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీతో ఇది మరింత చౌకగా లభించనుంది.

మరిన్ని వార్తలు