ఓలాకి పోటీగా ఆగస్టు 15న వస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

12 Aug, 2021 17:41 IST|Sakshi

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన మొదటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ వెబ్ సైట్లో ఆగస్టు 15 నుంచి సాయంత్రం 5 గంటల నుంచి ₹1,947 ధరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. "సింపుల్ వన్ ద్వారా ఎలక్ట్రిక్ వేహికల్ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సృష్టించాలని మేం ఆశిస్తున్నాం. ఆగస్టు 15 మాకు చారిత్రాత్మక రోజు" అని కంపెనీ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు.సింపుల్ వన్ లాంఛ్ తర్వాత తన ప్రత్యర్థులైన ఓలా స్కూటర్, అథర్ 450ఎక్స్ తో తలపడనుంది.

సింగిల్ చార్జ్ చేస్తే 240 కి.మీ మైలేజ్ 
సింపుల్ వన్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు ఆగస్టు 15న లాంఛ్ కానున్నాయి. అథర్ 450 ఎక్స్ ఇప్పటికే ₹99,000 ధరకు లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు గల 4.8 కిలోవాట్ అవర్(కెడబ్ల్యుహెచ్) లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేయనున్నట్లు పేర్కొంది. ఈ స్కూటర్ బ్యాటరీ 70 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ కానున్నట్లు కంపెనీ తేలుపుతుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 'ఎకో మోడ్'లో 240 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల అత్యదిక వేగంతో వెళ్తుంది. 3.6 సెకన్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్ బోర్డ్ నావిగేషన్ సపోర్ట్ ఉన్నాయి. సింపుల్ వన్ ధర ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. సింపుల్ వన్ మొదటి దశలో 13 రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. అలాగే, ఆగస్టు 150న రానున్న ఓలా స్కూటర్ ధర కూడా ₹1,20,000 ఉండే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు