జస్ట్‌ మూడు నెల గ్యాప్‌లో 70వేల కోట్లపైగా నష్టం, రిచ్‌ పర్సన్‌ పొజిషన్‌ ఫసక్‌

6 Jan, 2022 09:25 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌ పరిణామాలు.. ఊహాతీతం. ఎప్పుడు.. ఎవరి కొంప ముంచుతాయో.. ఎవరిని అందలం ఎక్కిస్తాయో? ప్చ్‌.. చెప్పడం కష్టం. రెండేళ్ల తర్వాత ఆ దిగ్గజ కంపెనీ స్టాక్‌ ధరలు ధబేల్‌మని మునిగిపోయాయి. ఆ ప్రభావం ఓ బిలియనీర్‌ మీద పడగా.. మొత్తంగా ఆయనకు వాటిల్లిన నష్టం ఇప్పట్లో రికవరీ అయ్యేలా కనిపించడం లేదు.


సింగపూర్‌ గేమింగ్‌ బిలియనీర్‌ ఫారెస్ట్‌ లీ(44)కి భారీ షాక్‌ తగిలింది. చైనా గేమింగ్‌ దిగ్గజం టెన్‌సెంట్‌, సీ లిమిటెడ్‌ కంపెనీ వాటాలో కోత విధించడంతో.. ఫారెస్ట్‌ లీకి తీవ్ర నష్టం వాటిల్లింది. 2021 అక్టోబర్‌ నుంచి ఆయనకు బ్యాడ్‌ టైం స్టార్ట్‌కాగా.. తాజా పరిణామాలు ఆయన ఆదాయంపై భారీగా దెబ్బేశాయి . దీంతో ఆయన వేల కోట్లు నష్టపోయాడు. 


సీ లిమిటెడ్‌ చైర్మన్‌-సీఈవో అయిన ఫారెస్ట్‌ లీ.. గత అక్టోబర్‌లో అమెరికన్ డిపాజిటరీ రసీదులు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి తన సంపదను క్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. ఈ తరుణంలో సీ కంపెనీ వాటాను 21 శాతం నుంచి 18 శాతానికి కోత విధించినట్లు  మంగళవారం టెన్‌సెంట్‌ కంపెనీ ప్రకటించింది. గేమింగ్‌-ఈకామర్స్‌ దిగ్గజం అయిన టెన్‌సెంట్‌ స్టాక్‌ ధరలు రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పతనం కావడమే ఇందుకు కారణం. ఈ చర్యతో సీ కంపెనీ వోటింగ్‌ హక్కులు సైతం 10 శాతానికి పడిపోయింది. 

ఇక తాజా పరిణామంతో ఈ మూడు నెలల్లోనే ఫారెస్ట్‌ లీకి వాటిల్లిన నష్టం 10 బిలియన్‌ డాలర్లకు పైమాటేనని  బ్లూమరాంగ్‌ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.. అంటే మన కరెన్సీలో 70 వేల కోట్ల రూపాయలకు పైమాటే.  ఒక్క మంగళవారమే 1.5 బిలియన్‌ డాలర్లు(పది వేల కోట్ల రూపాయలకు పైనే) లీ నష్టపోయాడు. ప్రస్తుతం ఫారెస్ట్‌ లీ సంపద 11.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీంతో సింగపూర్‌ రిచ్‌ పర్సన్‌ జాబితాలో మూడు ప్లేస్‌కు చేరుకున్నాడు. టెన్సెంట్‌ స్టాక్‌ ధరలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఈ ప్రభావంతో ఫారెస్ట్‌ లీకి వాటిల్లి నష్టం సైతం ఇప్పట్లో రికవరీ కాకపోవచ్చని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

ఫారెస్ట్‌ లీతో పాటు గ్యాంగ్‌ యే, డేవిడ్‌ చెన్‌ అనే ఇద్దరు 2009లో సీ లిమిటెడ్‌ కంపెనీని ప్రారంభించారు. షాపీ అనే ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌, మొబైల్‌ గేమ్‌ ఫైర్‌ ఫ్రీ(గూగుల్‌ ప్లేలో వంద కోట్ల డౌన్‌లోడ్‌లు దాటిన గేమ్‌ ఇదే) అందిస్తోంది. అయితే సీ లిమిటెడ్‌ పేరుకు సింగపూర్‌ కంపెనీ అయినప్పటికీ.. ట్రేడ్‌ మాత్రం అమెరికా ఆధారితంగానే నడుస్తోంది. ఈ కంపెనీ ద్వారా యే, చెన్‌లకు 6.3 బిలియన్‌ డాలర్లు, 2.1 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది ఇప్పటిదాకా.

కొవిడ్‌ టైంలో సింగపూర్‌ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌, గేమింగ్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. దీనిని సీ లిమిటెడ్‌ క్యాష్‌ చేసుకోగా.. ఆ ఎఫెక్ట్‌తో  ఫారెస్ట్‌ లీ ఏకంగా సింగపూర్‌ రిచ్చెస్ట్‌ పర్సన్‌గా అవతరించాడు. అయితే ఆ ఘనత ఎంతోకాలం కొనసాగలేదు.  తీవ్రమైన పోటీ నేపథ్యం, స్టాక్‌ మార్కెట్‌ కుదేలు, ఇతర పరిణామాలతో ఆయన సంపద కరిగిపోతూ వస్తోంది.

మరిన్ని వార్తలు