128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు

4 Jan, 2021 18:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్ కు బిజినెస్ పరంగా ఇండియా చాలా కీలకమని ఓయో పేర్కొంది. ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్ తన మూడవ వార్షిక ట్రావెల్‌ ఇండెక్స్‌ ఓయో ట్రావెలోపిడియా 2020ను ఈ రోజు విడుదల చేసింది. అన్ని దేశాల్లో కెల్లా ఇండియాలోనే ఎక్కువగా యూజర్లు ఓయో ద్వారా రూమ్స్ బుక్ చేసుకున్నట్లు సంస్థ పేర్కొంది. 2020లో రూమ్ బుకింగ్స్ ను నగరాల వారీగా పరిశీలిస్తే ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే వ్యాపార ప్రయాణికుల రూమ్ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ తోలి స్థానంలో‌ నిలిచింది. అదే విధంగా భారత్ లో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది.(చదవండి: ‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’)

2020లో ఒకే అతిధి 128 సార్లు తమ ఆతిథ్యం స్వీకరించారని ఓయో పేర్కొంది. ఈ కరోనా సమయంలో కూడా ఒక అతిధి ఇన్ని సార్లు బుకింగ్ చేసుకున్నాడంటే ఇక్కడ మేము తీసుకునే జాగ్రత్తలు, మార్కెట్ లో ఓయో బ్రాండ్‌ కు ఉన్న విలువ ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చని ఓయో ప్రతినిధులు పేర్కొన్నారు. కొన్ని వందల సార్లు చెప్పినా "జాగ్రత్తగా వెళ్లిరండి" అనే మాటకు అసలైన అర్ధాన్ని నేడు తెలుసుకున్నామన్నారు. అలాగే మరో ఓయో కస్టమర్ ఏడాది పొడవునా సుమారు 50,000 సెకన్లు(13.88 గంటలు) యాప్ లో గడిపినట్లు పేర్కొంది. దీంతో బయటికి వెళ్లినప్పుడు ఓయో రూమ్ లో గడపాలనే తన కోరికను అర్ధం చేసుకోవచ్చు అని తెలిపింది.  

మరిన్ని వార్తలు