పెట్టుబడులకు నైపుణ్యం తప్పనిసరి

27 Sep, 2021 03:36 IST|Sakshi

స్టాక్స్‌ వెంట పరుగులొద్దు

స్పష్టత లేకపోతే వాయిదానే బెటర్‌

తగినంత అధ్యయనం తర్వాతే ముందడుగు

రిస్క్‌ సామర్థ్యం ఆధారంగానే నిర్ణయాలు

లేదంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గం

స్టాక్స్‌లో పెట్టుబడులు ఎప్పుడూ కూడా దీర్ఘకాలం కోసమే అయి ఉండాలి. ఎందుకంటే స్వల్పకాలంలో ఎటువంటి పరిణామాలు అయినా మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. సంక్షోభాలు ఎన్ని వచి్చనా.. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలు పునరుద్ధానంతో ముందుకే ప్రయాణిస్తుంటాయి. స్టాక్‌ మార్కెట్లు కూడా అంతే. ఆర్థిక వ్యవస్థతోనే అనుసంధానమై ఉంటాయి కనుక స్టాక్స్‌లో పెట్టుబడులు స్వల్పకాల దృష్టితో చేయకూడదు.

స్టాక్స్‌లో పెట్టుబడులకు సంబంధించి కచి్చతంగా నైపుణ్యాలు అవసరం. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టయితే ప్రతీ పెట్టుబడి కూడా తార్కికంగా, పూర్తిస్థాయి విశ్లేషణతో, అవగాహనతో కూడుకుని ఉండాలి. అంతేకానీ, స్టాక్స్‌ వెంట పరుగులు పెట్టకూడదు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో పెట్టుబడి నిర్ణయాలను రోజులు, వారాలు, నెలలపాటు వాయిదా వేసుకున్నా నష్టం లేదు. ఈ పెట్టుబడి కచి్చతంగా మార్పును తీసుకొస్తుందన్న నమ్మకం ఏర్పడే వరకు వేచి చూడొచ్చు. వాయిదా వేయడం వల్ల ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టలేకపోయామన్న విచారం అక్కర్లేదు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనంలో తెలుసుకుందాం.

ఇదంతా మొబైల్‌ యుగం. ఇంటి నుంచే నిమిషాల్లో ట్రేడింగ్‌ ఖాతాను తెరిచేసి, మొబైల్‌యాప్స్‌ నుంచే స్టాక్స్‌ను కొనుగోలు చేయడం ఎంతో సులభంగా మారిపోయింది. అయితే నష్టాలు రాకుండా ఎలా వ్యవహరించాలన్నది చాలా మందికి అంతగా తెలిసిన విషయం కాదు. లాభాలు తర్వాత ముందు పెట్టుబడిని కాపాడుకోవాలనే ప్రాథమిక సూత్రం ఈక్విటీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే పెట్టుబడిని నష్టపోయామంటే.. ఆ నష్టాలు పూడ్చుకుని, లాభాలు పొందేందుకు సుదీర్ఘ సమయం శ్రమించాల్సి వస్తుంది. నష్టాలపాలు కాకూడదనుకుంటే.. పెట్టుబడుల నిర్ణయాల విషయంలో ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

నిజానికి అధిక శాతం ఇన్వెస్టర్లకు తమ రిస్క్‌ సామర్థ్యంపై అవగాహన ఉండదు. నష్టాలు వచి్చన తర్వాతే స్టాక్‌ మార్కెట్లో ఆటుపోట్ల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంటారు. లాభాలు వచ్చినప్పుడు కలిగే ఆనందంతో పోలిస్తే.. నష్టాలు వచ్చినప్పుడు కలిగే బాధ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కనుక పూర్తి స్పష్టత లేని సమయాల్లో ఆచితూచి అడుగు వేయడమే శ్రేయస్కరం. నష్టం వస్తే ఎంత వరకు సర్దుబాటు చేసుకోగలరన్న స్పష్టత ఉండాలి. ఫలానా పెట్టుబడిలో ఇంత లాభం వస్తే విక్రయిస్తామని అనుకున్నట్టే.. నష్టం వస్తే వ్యూహం ఏంటన్నది మీ రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఈ విషయాల్లో స్పష్టత లేకపోతే నిపుణులు నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గాన్ని ఆశ్రయించడం మంచిది.  

కారణాలు తెలియాల్సిందే..
ఇన్వెస్ట్‌ చేస్తున్న ప్రతీ సందర్భంలోనూ.. ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు, ఆ కంపెనీపై మీకున్న అంచనాలను ఓ జాబితాగా రాసుకోవాలి. ఆ పెట్టుబడిని సమీక్షించే ప్రతిసారీ ఆ జాబితాను ముందేసుకుని మీ అంచనాలకు తగినట్టే కంపెనీ పనితీరు, నిర్ణయాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. దీనివల్ల ఆయా రంగం/స్టాక్‌ను మీరు విశ్లేíÙంచగలరా? లేదా అన్నది తెలుస్తుంది. అంతేకాదు కొనుగోలు తర్వాత మరింత పడిపోతే.. ఆ స్టాక్‌లో అదనపు పెట్టుబడులతో వాటాలు పెంచుకోవడం లేదా యావరేజ్‌ (సగటు ధరను తగ్గించుకోవడం) చేసుకోవచ్చా అన్న విషయమై అవగాహన ఉంటుంది. ఒకవేళ మీ అంచనాలకు అనుగుణంగా కంపెనీ పనితీరు లేకపోయినా లేదా అంచనాలు తప్పిన తర్వాత కూడా ఆయా స్టాక్‌ పడిపోయిందని యావరేజ్‌ చేయాలనుకుంటుంటే.. అది పెద్ద తప్పిదమే అవుతుంది. అంటువంటి సందర్భాల్లో మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలి.

దీనివల్ల ఆ తర్వాతి నిర్ణయాల్లో అయినా కచి్చతంగా వ్యవహరించడం సాధ్యపడుతుంది. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు రోజువారీ మార్కెట్ల గమనాలను పట్టించుకోవక్కర్లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉందని చెప్పి అదే పనిగా స్టాక్‌ ధరలను గమనిస్తున్నట్టయితే.. మార్కెట్‌కు సంబంధించి వచ్చే ఎన్నో వార్తలు మీ కొనుగోలు, అమ్మకాల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ప్రతీ సెకన్‌కు స్టాక్‌ ధరలు అటూ, ఇటూ కదలాడుతూనే ఉంటాయి. కొన్ని ఉన్నట్టుండి అనూహ్యంగా లాభపడడం, పడిపోవడం కూడా సర్వసాధారణమే. అందుకే వీటిని అదేపనిగా గమనిస్తూ భావోద్వేగాలకు గురికావడానికి దూరంగా ఉండాలి. మీరు ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీలకు సంబంధించి వారానికోసారి తాజా సమాచారం, విశ్లేషణలను చూడడం తప్పుకాదు. నెలవారీ, త్రైమాసికం వారీగా పెట్టుబడుల పనితీరును సమీక్షించుకుంటే సరిపోతుంది.  

సూత్రాలను పాటించడమే మంచిది
విజయవంతమైన ఇన్వెస్టర్‌ అవ్వాలంటే వారికి ఉండాల్సిన ముఖ్యమైన గుణం భావోద్వేగాలపై నియంత్రణేనని అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ గురుగా పేరుగాంచిన వారెన్‌ బఫెట్‌ అనుభవసారం చెబుతోంది. దురదృష్టవశాత్తూ చాలా మందికి స్టాక్స్‌లో పెట్టుబడుల విషయంలో ఇదే లోపిస్తోంది. ఒక స్టాక్‌ను కొన్న తర్వాత అది మంచి షేరయినా కొన్న దానికి కొంచెం ధర తగ్గినా ఎంతో భయపడిపోతుంటారు. అలాంటి పరిస్థితిలో కొంచెం లాభం వచ్చినా అమ్మేసేవారు కొందరైతే, ఇంకా పడిపోతుందన్న భయంతో నష్టంలోనైనా వదిలించుకుందామనుకునేవారు మరి కొందరు. వెంటనే యావరేజ్‌ మంత్రం జపించేవారూ ఉంటారు. ఇలాంటి మానసిక స్థితిని అధిగమించాలంటే పెట్టుబడులకు సంబంధించి కచి్చతంగా సూత్రాలను అనుసరించాల్సిందే.

ఇలాంటివి మీ రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా మీకు మీరే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక్క కంపెనీలో పెట్టుబడులు.. తమ మొత్తం పెట్టుబడుల్లో 20 శాతం మించకూడదన్నది ఒక సూత్రం. అలాగే, ఒక స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత.. అది మరింత పతనం అయితే, కనీసం 30–50 శాతం పడిపోయిన తర్వాతే మరింత పెట్టుబడులతో యావరేజ్‌ చేయడం కూడా ఒకటి. అలాగే, నెలలో ఒక్కసారే ఇన్వెస్ట్‌ చేయడం. మార్కెట్లు 10–20 శాతం పడిపోయిన సందర్భాల్లోనే పెట్టుబడులు పెట్టుకోవడం.. ఇలాంటివన్నీ కూడా స్టాక్స్‌ పెట్టుబడులకు సంబంధించి అనుసరణీయ సూత్రాలు. వీటిని అనుసరించడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. భావోద్వేగాల కారణంగా పెట్టుబడుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దూరంగా ఉండొచ్చు.

మార్కెట్‌ పండితులు అనుభవం నుంచి చెబుతున్న సూత్రాలు.. మీరు స్వయంగా పెట్టుబడుల విషయంలో నేర్చుకున్న పాఠాలు, అనుభవాల ఆధారంగా మీకు అనుకూలంగా ఉండే నిబంధనలను రూపొందించుకుని.. వాటిని కచి్చతంగా అనుసరించాలి. ఆచరణ లేకపోతే ఎంత అనుభవం ఉన్నా అనుకున్న ప్రయోజనం నెరవేరదు. ఉదాహరణకు కొనుగోలు ధర నుంచి స్టాక్‌ 50 శాతం పడిపోతేనే యావరేజ్‌ చేయాలని మీరు ఒక నిబంధన పెట్టుకున్నారనుకోండి. 30 శాతం పడిపోయిన వెంటనే ఆకర్షణీయంగా భావించి పెట్టుబడులకు తొందరపడితే అది ఆచరణ తప్పుతున్నట్టే అవుతుంది. భావోద్వేగాలపై నియంత్రణ లేనప్పుడే ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కనుక ఆచరణ పక్కాగా ఉండేలా ప్రణాళికలు, నియమావళి పాటించాలి.

ప్రతిఫలం ఎంత..?
పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రతీ సందర్భంలోనూ ప్రతిఫలం విషయమై విశ్లేషణ కూడా చేసుకోవాలి. మార్కెట్లు భిన్న సమయాల్లో విభిన్నమైన పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి. 10 శాతం పెరుగుతుందని అంచనా వేసుకుంటే.. 50 శాతం పడిపోవచ్చు. లేదా 20 శాతం వరకు పడిపోతుందని అంచనాతో ఉంటే.. 50 శాతం వరకు పెరగొచ్చు. వడ్డీ రేట్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నందున 10 శాతం లాభం వచ్చినా చాలనుకునే వారూ ఉన్నారు. కొన్న ధర నుంచి 50 శాతం పెరిగిన తర్వాత విక్రయించాలని నిర్ణయించుకుని.. 50 శాతం పెరిగిన తర్వాత మరో 50 శాతం పెరిగితేనే విక్రయించాలని నిర్ణయం మార్చుకోకూడదు.

ఒకవేళ ఆ స్టాక్‌ ధర తిరిగి పడిపోతుంటే ఆందోళనతో సరైన నిర్ణయాన్ని అమలు చేయని సందిగ్ధతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడులపై ఎంత ప్రతిఫలం ఆశిస్తున్నదీ ముందుగానే ఒక అంచనాతో ఉండాలి. దానివల్ల ఏకపక్షంగా వ్యవహరించకుండా సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది. ఎంత లాభం ఆశిస్తున్నదీ తెలియకపోతే పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మార్కెట్లు ఎప్పుడూ ముందుకే వెళతాయన్న అంచనాలతో ఉంటే అది కూడా పెద్ద తప్పిదమే అవుతుంది. కనుక నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు తగినన్ని నైపుణ్యాలు ఉండాలి. అవి లేకపోతే.. నేర్చుకునే వరకు అయినా మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచిది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు