ధరల పెంపు దిశగా మరో కార్ల కంపెనీ! జనవరి నుంచి అమలుకి ప్లాన్‌

17 Dec, 2021 18:09 IST|Sakshi

కార్ల కంపెనీలు వరుసగా షాక్‌ ఇస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. కరోనాతో ఓ వైపు ఆదాయం తగ్గిపోగా మరోవైపు పెట్రోలు ,డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా కార్ల ధరల పెంపు వచ్చి చేరింది.

ఫోక్స్‌ వ్యాగన్‌ సబ్సిడరీ కంపెనీ స్కోడా ఇండియా మార్కెట్‌లో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. పెరిగిన ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. సగటున ప్రతీ మోడల్‌పై 3 శాతం వరకు ధరలు పెరగబోతున్నాయి.

స్కోడా కంపెనీ నుంచి కుషాక్, ర్యాపిడ్‌, కోడియాక్‌, ఓక్టావియా వంటి పాపులర్‌ మోడళ్లు ఉన్నాయి. మన్నికతో కూడిన వేగం అందివవ్వడం స్కోడాకు మార్కెట్‌లో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. మిడ్‌ రేంజ్‌ కార్ల మార్కెట్‌లో స్కోడాకు ప్రత్యేక స్థానం ఉంది. 

చిప్‌సెట్ల కొరత సమస్యను తెర మీదకు తీసుకువచ్చి మారుతి మొదలు మేజర్‌ కార్ల తయారీ కంపెనీలు గత మూడు నెలలుగా ధరలు పెంచుతూ వచ్చాయి. ఇప్పుడు చిప్‌సెట్ల సంగతి మూలనర పడగా  రా మెటీరియల్‌ ధరలు ముందుకు వచ్చాయి. దీంతో మరోసారి కార్ల కంపెనీలు ధరలు పెంచుతాయా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

చదవండి: ఆ రాష్ట్రంలో 2022 జనవరి 1 నుంచి డీజిల్ వాహనాలు బ్యాన్..!

మరిన్ని వార్తలు