Skoda: హల్‌చల్‌ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్‌ కారు..! రేంజ్‌ ఎంతంటే...?

11 Jan, 2022 20:19 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై ప్రముఖ చెక్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం స్కోడా స్పీడ్‌ పెంచింది. గ్లోబల్‌ మార్కెట్లలోకి ఎలక్ట్రిక్‌ వాహనాలను మరింత వేగంగా లాంచ్‌ చేసేందుకు సిద్దమైంది. కళ్లు చెదిరే లుక్స్‌తో స్కోడా పోర్ట్‌ఫోలియోనుంచి రానున్న ఎలక్ట్రిక్‌ కారు ఎన్యాక్‌ కూపే iV (Enyaq Coupe iV) గ్లిప్స్‌ను తాజాగా కంపెనీ విడుదల చేసింది. 

స్కోడా ఎన్యాక్‌ కూపే iV లాంచ్‌ ఎప్పుడంటే..?
ఎలక్ట్రిక్‌ కార్లలో భాగంగా స్కోడా ఎన్యాక్‌ కూపే iV ఎస్‌యూవీను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్‌ చిత్రాలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. భారత మార్కెట్లలోకి స్కోడా Enyaq Coupe iV ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ  కారు ఎన్యాక్‌ iVకు ఎస్‌యూవీగా రానుంది. 

క్రేజీ లుక్స్‌తో...!
వోక్స్‌వ్యాగన్ ID.5 స్ఫూర్తితో స్కోడా Enyaq Coupe iV ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ చేసినట్లు కన్పిస్తోంది. దూకుడుగా ఉండే ఫ్రంట్ ఫేస్‌తో పాటు వాలుగా ఉండే రూఫ్‌లైన్, పెద్ద వీల్ ఆర్చ్‌లు ఎన్యాక్ కూపే iVకి బోల్డ్ రోడ్ లుక్‌ను అందించనున్నాయి. సైడ్ స్కర్ట్‌లు బాడీ కలర్‌లో పెయింట్ చేశారు. వెనుకవైపు స్కోడా సిగ్నేచర్ సి-ఆకారపు బ్యాక్‌ లైట్లు రానుంది.  విలక్షణమైన ఫ్రంట్ గ్రిల్‌తో పాటుగా 131 ఎల్‌ఈడీ లైట్స్‌ను అమర్చారు. 

రేంజ్‌ విషయానికి వస్తే..!
స్కోడా ఎన్యాక్ కూపే iV ఎస్‌యూవీ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 510 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.  ఈ కారు సున్నా నుంచి 100 kmph వేగాన్ని కేవలం 6.2 సెకన్లలోనే చేరుకోనుంది.  కాగా స్కోడా ఎలక్ట్రిక్‌ కార్లలో భాగంగా మరో ఐదు వేరియంట్లను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. ఈ కార్ల సామర్థ్యం 148 hp నుంచి 306 hp వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. టాప్ వెర్షన్ గరిష్టంగా 180 kmph వేగాన్ని కలిగి ఉంది. 

చదవండి: మహీంద్రా సంచలన నిర్ణయం..! ఆ కంపెనీని పూర్తిగా అమ్మేసింది..!

మరిన్ని వార్తలు