త్వరలో భారత మార్కెట్లోకి స్కోడా ఎలక్ట్రిక్‌ కార్లు

7 Mar, 2022 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ: స్కోడా తాజాగా భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2030 నాటికి దేశీ మార్కెట్లో 25–30%వాటా ఎలక్ట్రిక్‌ కార్లది ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టడంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. అయితే, ఎప్పట్లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేదీ ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు, స్వల్పకాలికంగా చూస్తే.. సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) కార్ల విభాగంలోకి ప్రవేశించే ప్రణాళికలేవీ లేవని ఆయన వివరించారు. తమ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ, ఇంజిన్లు ఇందుకు అనుగుణమైనవి కావని పేర్కొన్నారు.

స్కోడా దేశీ మార్కెట్లో కుషాక్, స్లావియా, ఆక్టావియా, సూపర్బ్, కోడియాక్‌ వంటి మోడల్స్‌ను విక్రయిస్తోంది. ప్రముఖ జర్మనీ కార్‌ మేకర్‌ కంపెనీ అయిన ఫోక్స్‌వ్యాగన్‌ అనుబంధ కంపెనీగా స్కోడాకి ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. 
 

మరిన్ని వార్తలు