Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్‌ఎస్టేట్‌ ఏజెంట్‌! పరీక్ష రాసి మరీ..

3 Jun, 2023 17:18 IST|Sakshi

Oldest Real Estate Agent: వయసు శరీరానికే కానీ ఉత్సాహానికి కాదు.. వృద్ధాప్యం దేహానికే కానీ నిరంతరం పనిచేసే తత్వానికి కాదు.. అని నిరూపిస్తున్నారు ముంబైకి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌. 

ముంబైలోని ములుండ్ మైక్రో-మార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఎస్‌ఎం మాల్డే. ఓల్డెస్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌. మే 20న మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారేరా) నిర్వహించిన యోగ్యత పరీక్షలో 74 ఏళ్ల వయసులో ఉత్తీర్ణులయ్యారు. 75 శాతం మార్కులు సాధించారు. మాల్డే నాలుగు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

ఈ వయసులో పరీక్ష ఎందుకు?
ఈ వయసులో మాల్డే పరీక్ష ఎందుకు రాశారో మనీ కంట్రోల్‌ వార్తా సంస్థకు తెలియజేశారు. తాను పరీక్ష రాయడానికి కారణాలు కేవలం రెండే రెండు. ఒకటి ఈ పరీక్ష ఉత్తీర్ణులైనవారికి అధీకృత రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌లుగా గుర్తిస్తుంది. రెండోది మరికొన్ని ఏళ్లపాటు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేయాలనేది. తాను ఇన్నేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న తనకు అధీకృత గుర్తింపు లేదని, ఈ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాక ఇప్పుడు తనకు గుర్తింపు లభిస్తుందని  మాల్డే చెబుతున్నారు. 

మహారేరా మొదటి బ్యాచ్‌ పరీక్షకు మాల్డే హాజరయ్యారు. దీని ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అప్పుడు కొంత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తాను కోలుకుని మళ్లీ తన వృత్తిలోకి వచ్చేశానని, మంచి ఇల్లు కొనాలనుకునేవారికి మంచి సలహాలు, సూచనల ద్వారా సహాయం అందిస్తుంటానని మాల్డే పేర్కొన్నారు. తనకు వ్యాపారం అన్నది ప్రాధాన్యం కాదని, కొనుగోలుదారులకు సరైన గైడెన్స్‌ ఇవ్వాలన్నది తన ప్రథమ సంకల్పమని వివరించారు. అందుకు తనకు ముంబై ప్రాంతంలో మంచి పేరు ఉందని చెప్పారు.

చిన్న గది నుంచి ప్రీమియం అపార్ట్‌మెంట్‌ వరకు..
రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వృత్తిలో తన ప్రయాణం గురించి మాల్డే మాట్లాడుతూ.. తాను ఒక చిన్న గదిలో నివసించానని, ఈ రోజు ములుండ్‌ ప్రాంతంలో ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని గర్వంగా చెప్పారు. 750 చదరపు అడుగుల కార్పెట్‌తో కూడిన 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ అది.  తనకు గుర్తింపుతోపాటు అన్ని ఇచ్చిన తన వృత్తికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా మాల్డే కుమార్తె యూకేలో ఉంటున్నారు.

తన 40 ఏళ్ల రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కెరీర్‌లో మాల్డే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో 20,000కుపైగా లావాదేవీలు చేసుంటారు. ఇప్పటికీ నెలలో కనీసం మూడు లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నారాయన. వీటిలో ఒకటి తన కోసం, మరొకటి తన ఉద్యోగుల ఖర్చుల కోసం, మిగిలినది తన  ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసమని మాల్డే వివరించారు.

కాగా మహారేరా మే 20 న నిర్వహించిన యోగ్యత పరీక్షకు హాజరైనవారిలో 95 శాతం ఉత్తీర్ణులయ్యారని మే 30న ప్రకటించింది. మొదటి బ్యాచ్‌ పరీక్షకు 423 మంది హాజరుకాగా 405 మంది ఉత్తీర్ణులయ్యారు. గృహ కొనుగోలుదారులు, డెవలపర్‌ల మధ్య వారిధిగా వ్యవహరించే రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు ఈ పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది మహారేరా నమోదిత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ రిజిస్ట్రేషన్‌ను వీరు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి ➦ పార్లమెంట్‌ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..

మరిన్ని వార్తలు