రిటైర్మెంట్‌ తర్వాత స్థిరమైన ఆదాయానికి..

21 Nov, 2022 08:24 IST|Sakshi

స్మాల్‌క్యాప్‌ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. కనుక ఒకటికి మించిన స్మాల్‌క్యాప్‌ పథకాల్లో పెట్టుబడులు చేసుకోవచ్చా? ఎందుకంటే అసెస్‌మెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలన్నవి ఒక్కోటీ వేర్వేరు వెలుగు చూడని జెమ్స్‌ లాంటి కంపెనీలను గర్తించొచ్చు కదా..? – యోగేష్‌ పెట్టుబడులన్నవి ఎల్లప్పుడూ చాలా సులభంగా ఉండాలి. మేము అనుసరించే సూత్రం ఇదే. స్మాల్‌క్యాప్‌ పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించొచ్చా? అన్నది ప్రశ్న.

పూర్తి స్థాయి పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి వివిధ మార్కెట్‌ క్యాప్‌ సైజుల నుంచి నాలుగు లేదా ఐదు పథకాలను సూచిస్తుంటాం. చిన్న పోర్ట్‌ఫోలియో అయితే ఒక్కో కేటగిరీ నుంచి ఒక పథకాన్ని కలిగి ఉండొచ్చు. పెద్ద పోర్ట్‌ఫోలియో అయితే ఒకే విభాగం నుంచి రెండు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వేర్వేరు పథకాల మధ్య వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని గమనించి, ఆయా పథకాల పట్ల నమ్మకం ఏర్పడితే రెండు స్మాల్‌క్యాప్‌ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఇలా రెండు పథకాలను ఎంపిక చేసుకున్నప్పుడు వాటి పెట్టుబడుల పరంగా ఏకరూపత (ఒకే స్టాక్స్‌) 50% మించి ఉండకూడదు. ఏకరూపత అంటే రెండు స్మాల్‌క్యాప్‌ పథకాలు అవే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం. ఇంతకుమించితే పోర్ట్‌ఫోలియోకు రిస్క్‌ పెరుగుతుంది.

ఈ రిస్క్‌ను వైవిధ్యం చేసుకునేందుకు.. వేర్వేరు పెట్టుబడుల విధానంతో కూడిన వేర్వేరు అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు సంబంధించి రెండు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ఏకరూపత రిస్క్‌ తగ్గుతుంది. మొత్తంపెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్‌ విభాగానికి 20% మించకుండా చూసుకోవాలి.

నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న మార్గాలు ఏంటి? 
విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్‌ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి.

ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్‌ లేదా మరొకటి కావచ్చు. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ రాబడి కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది.

అందుకనే రిటైర్మెంట్‌ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బ ణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. 30–40% చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్‌ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.34.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి.

చదవండి: ఆధార్‌ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్‌!

మరిన్ని వార్తలు