30 రోజుల్లో 100 శాతం లాభాలు

17 Dec, 2020 16:41 IST|Sakshi

జోరు మీదున్న మార్కెట్లు- రికార్డుల ర్యాలీ

పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌

నెల రోజుల్లో రెట్టింపునకు ఎగసిన 29 కంపెనీలు

జాబితాలో జెట్‌ ఎయిర్‌, వక్రంగీ, ఆర్కిడ్‌ ఫార్మా

సువెన్‌ లైఫ్‌, డైనకాన్స్‌, గోల్డెన్‌ టొబాకో, బాఫ్నా ఫార్మా

ముంబై, సాక్షి: కోవిడ్‌-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లవైపు దృష్టిసారించారు. వెరసి పలు కౌంటర్లు గత నెల రోజుల్లోనే 100 శాతానికిపైగా లాభపడ్డాయి. గత 30 రోజుల్లో 29 కంపెనీలు రెట్టింపునకుపైగా ఎగశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 6 శాతమే లాభపడటం గమనార్హం! ఇటీవల దూకుడు చూపుతున్న కంపెనీల జాబితాలో జెట్‌ ఎయిర్‌వేస్‌, వక్రంగీ, డైనకాన్స్‌ సిస్టమ్స్‌, గోల్డెన్‌ టొబాకో, ఆర్కిడ్‌ ఫార్మా, బాఫ్నా ఫార్మా, ఆర్వీ డెనిమ్స్‌ తదితరాలు చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. (కోవిడ్‌-19లోనూ దిగ్గజాల దూకుడు)

జోరుగా హుషారుగా
మురారీ లాల్‌ జలాన్‌, కల్‌రాక్‌ క్యాపిటల్‌ కన్సార్షియం ద్వారా తిరిగి రెక్కలొచ్చిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ వరుసగా 8వ రోజు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 105.35 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. కొత్త ఏడాది(2021)లో దేశ, విదేశాలకు సర్వీసులను పునరుద్ధరించే ప్రణాళికల్లో ఉంది. మెట్రో నగరాలతో యూరోపియన్‌ దేశాలకు సర్వీసులను ప్రారంభించనుంది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకోగా.. గోల్డెన్‌ టొబాకో షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు చేరింది. గత మూడు రోజుల్లోనే 60 శాతం దూసుకెళ్లింది. తాజాగా రూ. 50.55 వద్ద నిలిచింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. ముంబైలోని విలే పార్లే ప్రాపర్టీని ఎక్సైజ్‌ శాఖ అటాచ్‌ చేసింది. అయితే ఈ సమస్యనుంచి బయటపడగలమని యాజమాన్యం భావిస్తోంది. అంతేకాకుండా గుంటూరులో గల ప్రాపర్టీని సైతం అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. (జూబిలెంట్‌ నుంచి బిర్యానీ- దివీస్‌ కొత్త రికార్డ్)

ఇతర కౌంటర్లూ
ఫార్మా కంపెనీ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నాలుగో రోజూ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 105.20 వద్ద ఫ్రీజయ్యింది. గత మూడు రోజుల్లో 10 శాతం చొప్పున జంప్‌చేసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 124 శాతం ర్యాలీ చేసింది. కాగా.. డైనకాన్స్‌ సిస్టమ్స్‌ తొలుత 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌కు చేరింది. రూ. 85.50 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆపై తిరిగి 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌కు చేరి రూ. 70 వద్ద ముగిసింది. ఈ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ షేరు గత వారం రోజుల్లోనే 88 శాతం పురోగమించింది. పీఎస్‌యూ సంస్థ యూబీఐ నుంచి రూ. 24.5 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు డైనకాన్స్ మంగళవారం ప్రకటించింది. 

నెల రోజుల తీరు
స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ప్రధానంగా ఆర్కిడ్‌ ఫార్మా, బాఫ్నా ఫార్మా, రాజ్‌ ఆయిల్‌, జిందాల్‌ ఫొటో, గోల్డెన్‌ టొబాకో, ట్రాన్స్‌ఫార్మర్స్‌(ట్రిల్‌), సువెన్‌ లైఫ్‌, డైనకాన్స్‌, ఆర్వీ డెనిమ్స్‌, బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్‌, వక్రంగీ, జెనిత్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఆర్ఫిన్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ తదితరాలు గత నెల రోజుల్లో 178-102 శాతం మధ్య దూసుకెళ్లడం విశేషం!

మరిన్ని వార్తలు