చిన్న షేర్లు.. లాభాల్లో తగ్గేదేలే!

5 Apr, 2022 16:53 IST|Sakshi

చిన్న షేర్లు– భారీ లాభాలు 

గతేడాది 37 శాతం జూమ్‌ 

సెన్సెక్స్, మిడ్‌ క్యాప్స్‌ను మించి జోరు 

నిర్మాణాత్మక బుల్‌ ట్రెండ్‌లో మార్కెట్‌ 

మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో చిన్న షేర్లు(స్మాల్‌ క్యాప్స్‌) భారీ లాభాలతో దూకుడు ప్రదర్శించాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు 37 శాతం వృద్ధి చూపింది. తద్వారా ప్రధాన ఇండెక్సులను సైతం అధిగమించి టాప్‌లో నిలిచింది. ఈ ర్యాలీలో భాగంగా 2022 జనవరి 18న 31,304 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇన్వెస్టర్లకు గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో పలు విధాల లాభాల తీపిని రుచి చూపాయి. ప్రధానంగా చిన్న షేర్లు భారీగా ఎగశాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌  18.3 శాతం(9,059 పాయింట్లు) లాభపడితే.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 36.6 శాతం(7,566 పాయింట్లు) జంప్‌చేసింది. ఇదే కాలంలో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 19.5 శాతమే(3,927 పాయింట్లు) బలపడింది. వెరసి గతేడాది స్మాల్‌ క్యాప్స్‌ హవా నడిచింది. కాగా.. ఈ స్పీడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లోనూ కొనసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం! 

చివర్లో ఆటుపోట్లు 
భౌగోళిక ఆందోళనలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) అమ్మకాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో గతేడాది చివర్లో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. తొలి అర్ధభాగంలో జోరు చూపిన మార్కెట్లు ద్వితీయార్థంలో కన్సాలిడేషన్‌ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల కారణంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూసినట్లు తెలియజేశారు. అయినప్పటికీ మార్కెట్లు పలు అందోళనల మధ్య కూడా నిలదొక్కుకుంటూ వస్తున్నట్లు తెలియజేశారు. ఇది నిర్మాణాత్మక బుల్‌ మార్కెట్‌కు నిదర్శనమని, మధ్యమధ్యలో దిద్దుబాట్లు దీనిలో భాగమని వివరించారు.  

క్లాసికల్‌ బుల్‌ 
క్లాసికల్‌ బుల్‌ మార్కెట్లో మధ్య, చిన్నతరహా షేర్లు ర్యాలీ చేయడం సహజమని ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్థ్‌ న్యాటి పేర్కొన్నారు. ఈ ఏడాది సైతం మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ జోరు చూపవచ్చని అంచనా వేశారు. స్వల్పకాలపు సవాళ్ల మధ్య దేశీ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లపాటు వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చరిత్ర ప్రకారం ఈక్విటీ మార్కెట్లకు ఏప్రిల్‌ ఉత్తమ నెలగా పేర్కొన్నారు. మిడ్, స్మాల్‌ క్యాప్స్‌నకు ప్రధానంగా కలసి వస్తుందని తెలియజేశారు. గత 15 ఏళ్లలో 14సార్లు ఇది జరిగిందని, సగటున 7 శాతం లాభాలు అందించాయని వెల్లడించారు.  

రికార్డుల బాటలో 
2021 ఏప్రిల్‌ 19న 52 వారాల కనిష్టానికి చేరిన బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఈ జనవరికల్లా 31,304 పాయింట్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. ఇదే విధంగా మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ గతేడాది అక్టోబర్‌ 19న 27,246ను దాటి కొత్త గరిష్టాన్ని అందుకుంది. 2021 ఏప్రిల్‌ 19న  19,423 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఇక మరోవైపు సెన్సెక్స్‌ 2021 అక్టోబర్‌ 19న 62,245 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. అయితే గత ఆరు నెలల్లో మార్కెట్లలో కరెక్షన్‌ చోటు చేసుకున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ ప్రస్తావించారు.

ఇది మధ్య, చిన్నతరహా షేర్లలో పెట్టుబడులకు అవకాశమన్నారు. లార్జ్, మిడ్‌ క్యాప్స్‌తో పోలిస్తే స్మాల్‌ క్యాప్స్‌ అందుబాటులో ట్రేడవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే స్వల్పకాలంలో ఆటు పోట్లు తప్పవని, ద్యవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, ఆర్జనల డౌన్‌గ్రేడ్స్‌ వంటి ప్రతికూలతలు ఎదురవుతాయని తెలియజేశారు. కాగా.. కరోనా మహమ్మారి తదుపరి ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందని, దీంతో పలు మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ ఊపందుకోనున్నాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఎస్‌.రంగనాథన్‌ అంచనా వేశారు.   

చదవండి: స్టాక్స్‌ మార్కెట్లలో తెలుగువారి హవా..భారీగా పెట్టుబడులు..! 

మరిన్ని వార్తలు