Mobile Data: మొబైల్‌ డేటా జెట్‌ స్పీడ్‌తో ఫసక్‌! ఇలా చేస్తే కచ్చితంగా వర్కవుట్‌ అవుతుంది

20 Jan, 2022 20:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

Mobile Data Usage And Data Saving Tips In Telugu: ఎన్నిసార్లు చెప్పా.. ఇంటర్నెట్‌ప్యాక్‌ కోసం ఎక్స్‌ట్రా రీఛార్జ్‌ అడగొద్దని? అంటూ అసహనంగా చెల్లిని మందలించాడు ప్రశాంత్‌.  ‘ఏం చేయను అన్నయ్యా..  డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది. ఆ విషయం తెలియకుండానే మొబైల్‌ డేటా లిమిట్‌ దాటేసిందని అలర్ట్‌ వస్తోంది’ అంటూ ముఖం వేలాడేసుకుని సమాధానం ఇచ్చింది గిరిజ. ఇంతకీ మొబైల్‌ డేటా లిమిట్‌ ఆన్‌లో పెట్టుకున్నావా? అని ప్రశాంత్‌  అనడంతో బిక్క ముఖం వేసింది గిరిజ.  


స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే కోట్ల మంది ఎదుర్కొనే సమస్య.. వేగంగా మొబైల్‌ డేటా అయిపోవడం. వైఫై కనెక్షన్‌ లేని ఇళ్లలో మొబైల్‌ డేటానే ఆధారం. ఓటీటీ, ఇతరత్రా సోషల్‌ యాప్‌లను ఉపయోగిస్తూ రోజూ వారీ డేటా ఎలా అయిపోతోందో కనీసం తెలియదు కూడా. ఫుల్‌ సిగ్నల్‌ ఉందని..  ఇంటర్నెట్‌ జెట్‌ స్పీడ్‌తో వస్తోందని సంబరపడేవాళ్లు.. ఇంటర్నెట్‌ డేటా ఫటా ఫట్‌ అయిపోతుందని మాత్రం గుర్తించరు!. డేటా లిమిట్‌ మ్యాగ్జిమమ్‌ దాటి వెళ్లకుండా ఉండేదుకు పర్యవేక్షణ, పరిమితం చేయడం లాంటి మార్గాలు ఉంటాయని గుర్తిస్తే చాలు కదా!. 

మొబైల్‌ డేటా వాడకాన్ని మానిటరింగ్‌ చేయడం చాలా సులువు. ఏదైనా ఒక యాప్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టుకున్నప్పుడు.. యాప్‌ ఇన్ఫో app info అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అది క్లిక్‌ చేయగానే నేరుగా యాప్‌ సెట్టింగ్‌ పేజ్‌కి వెళ్తుంది. అక్కడ మొబైల్‌ డేటా&వైఫై ఆప్షన్‌ కనిపిస్తుంది. పైన బ్యాక్‌గ్రౌండ్‌-ఫోర్‌గ్రౌండ్‌లో ఆ యాప్‌ ఎంత డేటాను తీసుకుంటుందనే విషయం అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఆ యాప్‌ ఎక్కువ డేటాను లాగేస్తుందని అర్థమైతే.. వెంటనే అక్కడి ఆప్షన్స్‌ను ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. 

ఇక ఫోన్‌ సెట్టింగ్స్‌ యాప్‌ Settings appలో  డేటాసేవర్‌ Data Saver అనే ఫీచర్‌ కూడా ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు వినియోగించుకుంటున్న డేటాను నియంత్రిస్తుంది.   

గూగుల్‌ ప్లే స్టోర్‌లో.. డేటా మేనేజ్‌మెంట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కూడా మానిటర్‌ చేసుకోవచ్చు. పైగా ఒకేసారి ఒక్కోయాప్‌ ఎంతెంత డేటా తీసుకుంటున్నాయో ఒకేసారి చెక్‌ చేసుకోవచ్చు. గంట, రోజూ, వారాలు, నెలల తరబడి ఎంతెంత ఉపయోగిస్తున్నామో అక్కడ చూసుకోవచ్చు కూడా.

కొన్ని ఫోన్లలో డేటా లిమిట్‌ ఆప్షన్‌ నేరుగా ఉంటుందన్నది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అక్కడ ఫలానా ఎంబీ నుంచి జీబీల్లో డేటా లిమిట్‌ను సెట్‌ చేసుకోవచ్చు. సపోజ్‌ యూట్యూబ్‌లోగానీ, లేదంటే ఏదైనా ఓటీటీ యాప్‌లోగానీ సినిమా చూస్తూ ఉండిపోయినప్పుడు డేటా దానంతట అదే అయిపోతుంది. కానీ, లిమిట్‌ పెట్టుకోవడం వల్ల పరిధి దాటగానే అలర్ట్‌ ద్వారా అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఇంటర్నెట్‌ డేటాను నియంత్రించుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా లిమిట్‌ Data limit అని టైప్‌ చేస్తే ఆప్షన్‌ కనిపిస్తుంది. మరికొన్ని ఫోన్లలో Data Warning ఫీచర్‌ కూడా ఉంటుంది. 

లైట్‌ వెర్షన్‌, అలర్ట్‌నేట్‌ వెర్షన్‌ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా కూడా ఇంటర్నెట్‌ డేటాను తక్కువగా వాడొచ్చు. కానీ, వీటిలో చాలామట్టుకు సురక్షితమైనవి కానివే ఉంటాయి. కాబట్టి, ప్లేస్టోర్‌ నుంచి అథెంటిక్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టలాంటి యాప్‌ల్లో స్క్రోలింగ్ చేస్తూ ఉండగానే.. డేటా అయిపోయినట్లు మెసేజ్‌ వస్తుంది. అవి ఎక్కుడ డేటాను లాగేస్తాయి కాబట్టి..  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లైట్‌ వెర్షన్‌ యాప్‌ల ఉపయోగించొచ్చు. మొబైల్‌ డేటాను సేవ్‌ చేసుకోవచ్చు.

చదవండి: ఫొటోలు, వీడియోలు డిలీట్‌ చేయకుండా ఫోన్‌లో ఫ్రీ స్పేస్‌ పొందండి ఇలా.. 

మరిన్ని వార్తలు