కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్‌ ఫోన్ల సందడి

5 Jan, 2021 12:09 IST|Sakshi

రూ. 15,000లోపు ధరలోనే ట్రిపుల్‌ కెమెరాలతో ఫోన్లు

4కే- 8కే  వీడియోలకూ స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాలు రెడీ

జూమ్‌, ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ తదితర ఆధునిక ఫీచర్స్‌

భారీ సెన్సర్లు, జూమ్‌, ట్రిపుల్‌ కెమెరాల సెటింగ్స్‌

ముంబై, సాక్షి: కమ్యూనికేషన్‌ కోసం ప్రారంభమైన స్మార్ట్‌ ఫోన్లు తదుపరి కాలంలో ఎన్నెన్నో కొంత ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి. సరికొత్త ఫీచర్స్‌తో యూజర్ల జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ప్రధానంగా కెమెరాల విషయంలో అత్యంత ఆధునికతను సంతరించుకోవడం ద్వారా డిజిటల్‌ కెమెరాల విక్రయాలకే గండి కొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రూ. 15,000లోపు ధర కలిగిన స్మార్ట్‌ ఫోన్లు సైతం ఆధునిక కెమెరాలు, ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..

మెగా పిక్సెల్స్
గతంలో రెండు కెమెరాలతో వచ్చిన స్మార్ట్‌ ఫోన్లు లగ్జరీ విభాగంలో వెలువడేవి. ప్రస్తుతం ప్రస్తుతం 3-4 కెమెరాలు కలిగిన ఫోన్లు సాధారణమైపోయాయి. గత కొన్నేళ్లలో కెమెరాకు ప్రాధాన్యత భారీగా పెరిగింది. దీంతో ఫోన్లకు వెనుకవైపు కనీసం 3 కెమెరాలుంటేనే ప్రస్తుతం నియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాయి. కొద్ది రోజులుగా నైట్‌ మోడ్స్‌  వంటివి సాధారణ అంశాలైపోయినట్లు టెక్‌ నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో క్వాడ్‌కామ్‌ మాడ్యూల్స్‌ సైతం అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. లెన్స్‌ల సంఖ్య, మెగాపిక్సెల్స్‌ సామర్థ్యం, కెమెరా సాంకేతికత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.  (ఇకపై రియల్‌మీ 5జీ స్మార్ట్‌ ఫోన్లు)

8కే వీడియోలు
గతేడాది(2020)లో 4కే వీడియో చిత్రీకరణకు ఆకర్షణ పెరిగింది. దీంతో ఈ ఏడాది(2021) స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు 8కే వీడియోలపై దృష్టిసారించినట్లు టెక్‌ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గతేడాది చివర్లోనే ఇందుకు బీజం పడినప్పటికీ ఇవి ఏడాది, రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా 8కే వీడియోలను సపోర్ట్‌ చేయగల స్ర్కీన్లను సైతం అమర్చవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్మార్ట్‌ ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌ లేదా టీవీ సెట్లలో వీటిని ప్లే చేసేందుకు వీలైన తెరలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని వివరించారు. వెరసి 2022కల్లా 8కే వీడియో చిత్రీకరణ చేయగల స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. (2021లో రియల్‌మీ కీలక ఫోన్‌- కేవోఐ)

గింబల్‌ సపోర్ట్‌
కొన్నేళ్లుగా డిజిటల్‌ కెమెరాల స్థానంలో స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాల వినియోగం అధికమైంది. అన్నివేళలా ఫోన్లు అందుబాటులో ఉండటంతోపాటు.. చిత్రీకరణ అత్యంత సులభంకావడంతో వినియోగదారులు కెమెరా ఫీచర్స్‌పై దృష్టి సారించడం ఎక్కువైంది. దీంతో ఇటీవలి కాలంవరకూ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ను స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు సాధారణ ఫీచర్‌గా జత చేస్తూ వచ్చాయి. అయితే సెల్ఫీ ట్రెండ్‌ ప్రవేశించాక కెమెరాలు, వీటి ఫీచర్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో కంటెంట్‌లకు డిమాండ్‌ పెరగడంతో వీడియో సాంకేతికతకూ ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫొటోలు లేదా వీడియోల స్టెబిలైజేషన్‌పై దృష్టితో స్మార్ట్‌ ఫోన్ తయారీ కంపెనీలు కొత్తగా గింబల్‌ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. వివో కంపెనీ ఎక్స్‌50 ప్రోలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.  

సెన్సర్లకూ ప్రాధాన్యం
నిజానికి స్మార్ట్‌ ఫోన్లలో అత్యధిక మెగా పిక్సెల్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, సెన్సర్లకే ప్రాధాన్యం ఉన్నట్లు టెక్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు 4కే వీడియోలను చిత్రీకరించాలంటే కనీసం 8 మెగాపిక్సెల్‌ కెమెరాలు తప్పనిసరని వెల్లడించారు. వెరసి వీడియోల నాణ్యతకు వీలుగా భారీ సెన్సర్లను వినియోగించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇక 8కే వీడియోలను చిత్రీకరించాలంటే 33 మెగాపిక్సెల్‌ కెమెరాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని చెబుతున్నారు. కొంతకాలంగా యాపిల్‌, గూగుల్‌ తదితర దిగ్గజాలు 12 ఎంపీ కెమెరాలకే కట్టుబడుతూ వస్తున్నాయి. వీటికి జతగా ఇటీవల మరో 12 ఎంపీ కెమెరాలకు సైతం తెరతీశాయి. ఈ కంపెనీలతోపాటు నాణ్యమైన సెన్సర్లను వినియోగించడం ద్వారా పలు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు సైతం కెమెరా ఫీచర్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు నిపుణులు ప్రస్తావించారు.

డిస్‌ప్లేలో కెమెరా
సెల్ఫీ ట్రెండ్‌కు వీలుగా పలు కంపెనీలు డిస్‌ప్లేలో అంతర్భాగంగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ముందు భాగంలో పాపప్‌ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగానే నాచ్‌ స్టైల్‌ సెల్ఫీకెమెరాలు, పంచ్‌ హోల్‌ కెమెరాల ట్రెండ్‌కు తెరలేచింది. గతేడాది ఇన్‌డిస్‌ప్లే కెమెరాలకూ ఒప్పో, షియోమీ శ్రీకారం చుట్టాయి. ఇవి కొనసాగేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మూడు విభిన్న కెమెరాల ద్వారా చిత్రీకరించే ఫొటోలు లేదా వీడియోలకు చిప్‌ సెట్ సైతం సపోర్ట్‌ చేయవలసి ఉంటుందని, ఈ బాటలోనే క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ఎస్‌వోసీకి కొత్త ఏడాదిలో స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు