మూడేళ్ల కనిష్టానికి దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

15 Nov, 2022 05:05 IST|Sakshi

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 10 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో 10 శాతం క్షీణించింది. అమ్మకాలు మూడేళ్ల కనిష్టం 4.3 కోట్ల స్థాయికి పడిపోయాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) సోమవారం ఈ అంశాలు వెల్లడించింది. 2019 తర్వాత ఒక మూడో త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి నమోదు కావడం ఇదే ప్రథమం అని తెలిపింది. బలహీనపడుతున్న డిమాండ్, పెరుగుతున్న ధరలు వెరసి పండుగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది.

నిల్వలు పేరుకుపోవడం, పండుగ సీజన్‌ తర్వాత డిమాండ్‌ తగ్గుముఖం పట్టడం తదితర అంశాలతో డిసెంబర్‌ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించవచ్చని ఐడీసీ డివైజ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవ్‌కేందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో 2022 వార్షిక అమ్మకాలు 8–9 శాతం క్షీణించి 15 కోట్ల యూనిట్లకు పరిమితం కావచ్చని పేర్కొన్నారు. పెరుగుతున్న డివైజ్‌ల ధరలు, ఇతరత్రా ద్రవ్యోల్బణం, ఫీచర్‌ ఫోన్‌ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారడం నెమ్మదించడం తదితర అంశాలు 2023లో డిమాండ్‌కి ప్రధాన సవాళ్లుగా ఉండవచ్చని తెలిపారు. అయితే, 4జీ నుండి 5జీకి మారుతుండటం మిడ్‌–ప్రీమియం, అంతకు మించిన సెగ్మెంట్‌లలో వృద్ధికి కొంత దోహదపడవచ్చని సింగ్‌ వివరించారు.  

నివేదికలో మరిన్ని వివరాలు..
► సెప్టెంబర్‌ త్రైమాసికంలో అమ్మకాల్లో ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ వాటా అత్యధికంగా 58 శాతంగా నమోదైంది. ఈ–టెయిలర్లు పలు విడతలుగా నిర్వహించిన ’సేల్స్‌’ (ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్, అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ మొదలైనవి) ఇందుకు దోహదపడ్డాయి. ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్‌ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు ఇందుకు సహాయపడ్డాయి. ఆన్‌లైన్‌తో పోటీపడుతూ డిమాండ్‌ను అందుకోవడంలో ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ విఫలమయ్యాయి. దీంతో ఆఫ్‌లైన్‌ విక్రయాలు 20 శాతం క్షీణించాయి.  
► మీడియాటెక్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్‌కామ్‌ వాటా 25 శాతానికి తగ్గింది.  
► 21.2 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు షావోమీ సారథ్యం వహించింది. 18.5% మార్కె ట్‌ వాటాతో శాంసంగ్‌ రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వివో (14.6%), రియల్‌మి (14.2%), ఒప్పో (12.5%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం కేటగిరీలో 63 శాతం వాటాతో యాపిల్‌ అగ్రస్థానంలో నిల్చింది. షావోమీ టాప్‌ ప్లేస్‌లోనే ఉన్నప్పటికీ అమ్మకాలు 18 శాతం క్షీణించాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి చేరింది. 1.6 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి.

 

మరిన్ని వార్తలు