కొత్త టీవీ, స్మార్ట్‌ఫోన్లను కొనాలనుకుంటున్నారా..అయితే మీకో షాకింగ్‌ వార్త..!

21 Mar, 2022 20:30 IST|Sakshi

చైనాలో కరోనా వైరస్‌ మరోసారి పంజా విసురుతోంది. కరోనా వైరస్ దెబ్బకి చైనాలో మళ్లీ పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. చైనా టెక్ హబ్ షెన్‌జెన్‌లో కూడా కోవిడ్ కేసులు వీపరితంగా పెరిగిపోయాయి. ఇప్పుడిదే సామాన్యుల పాలిట భారంగా మారనుంది. చైనా టెక్‌ హబ్‌ షెన్‌జెన్‌లో లాక్‌డౌన్‌తో విధిస్తే స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సరఫరాలో షెన్‌జెన్‌ నంబర్‌ 1
ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ సరఫరా నగరాల్లో షెన్‌జెన్‌ ఒకటి. చైనాలో పెరుగుతున్న కోవిడ్‌-19 కేసుల నేపథ్యంలో..అక్కడి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకొనేందుకు  సిద్దమైంది. కాగా  ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో చైనాలోని షెన్‌‌జెన్‌ నుంచి 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు భారత్‌కు వస్తున్నాయి. ఇలాగే  కరోనా కేసులు పెరిగితే లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రీసెర్చ్ డైరెక్టర్ నవ్కేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. షెన్‌జెన్‌లో లాక్ డౌన్ మూడు వారాలు దాటితే అప్పుడు మన దేశంలోకి జూన్ త్రైమాసికపు స్మార్ట్‌ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్స్ దిగుమతులపై ప్రభావం పడుతుందని తెలిపారు. అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు.

లాక్‌ డౌన్‌ జరిగితే కష్టమే..!
ఇప్పటికే ప్రపంచదేశాలు తీవ్రమైన చిప్‌ కొరతను ఎదుర్కొన్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ప్రస్తుతం చైనాలో కోవిడ్‌ విజృంభించడంతో స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని  కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. సుమారు స్మార్ట్‌ఫోన్స్ ధరలు 5 నుంచి 7 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో ఆయా కంపెనీలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.  ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తే మాత్రం కంపెనీలు కచ్చితంగా ఆ భారాన్ని వినియోగదారులకు మోపే అవకాశం లేకపోలేదు. 

చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్‌కు సిద్ధమైన యూరప్‌ కంపెనీ..!

మరిన్ని వార్తలు