కోవిడ్‌తో వచ్చే దీర్ఘకాలిక బాధలను ఇట్టే పసిగడతాయి...!

11 Jul, 2021 19:31 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావంతో సుమారు 40 లక్షల మంది మరణించగా, 18. 5 కోట్ల మంది కరోనా వైరస్‌తో ఇన్‌ఫెక్ట్‌ అయ్యారు.  కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నవారు లాంగ్‌ కోవిడ్‌-19 దీర్ఘకాలిక బాధలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందినా కూడా శ్వాస కోశ, ఇతర బాధలతో అనేక మంది సతమతమవుతున్నారు.

తాజాగా కోవిడ్ -19తో వచ్చే  దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించడంలో స్మార్ట్‌వాచ్స్‌ ఎంతగానో సహాయపడుతున్నాయని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను గుర్తించడంలో  స్మార్ట్‌ వాచ్‌లు ఎంతగానో సహాయపడుతున్నాయి. ఆపిల్ వాచ్, ఫిట్‌బిట్ స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఇతర స్మార్ట్‌వాచ్‌లు కోవిడ్ -19 దీర్ఘకాలిక ప్రభావాలను కచ్చితంగా గుర్తించగలవని ఓ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. స్మార్ట్‌వాచ్‌ ధరించడంతో హృదయ స్పందన రేట్లను, శరీర ఉష్ణోగ్రత, శారీరక శ్రమ వంటివి స్మార్ట్‌వాచ్‌లో రికార్డవడంతో కోవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తి ఆరోగ్యాన్ని మానిటర్‌ చేయడం సులువు అవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

న్యూయర్క్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. కోవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో గణనీయమైన మార్పులను గుర్తించామని అధ్యయన పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్‌-19 కోలుకున్న వ్యక్తుల్లో ప్రవర్తనా​, శారీరక మార్పులను గమనించామని పరిశోధకులు తెలిపారు.అంతేకాకుండా కరోనా వైరస్‌ వారిని ఎంతగా ప్రభావం చేసిందనే విషయాన్ని గుర్తించడానికి స్మార్ట్‌వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడ్డాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రాబర్ట్‌ హిర్టెన్‌, ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ వేరబుల్‌ నిపుణుడు పేర్కొన్నారు.

డిజిటల్ ఎంగేజ్‌మెంట్ అండ్ ట్రాకింగ్ ఫర్ ఎర్లీ కంట్రోల్ అండ్ ట్రీట్మెంట్ (DETECT) ట్రయల్ అందించిన  డేటా ప్రకారం.. మార్చి 2020 నుంచి 2021 జనవరి వరకు ఫిట్‌బిట్‌లను, స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగిస్తోన్న 37,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి.వారు ధరించిన స్మార్ట్‌ వాచ్‌ డేటాలను పరిశోధకులతో పంచుకున్నారు. ఈ డేటాలో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులకు అధిక హృదయ స్పందన రేటు ఉందని అధ్యయనంలో కనుగొన్నారు. సాధారణం కంటే ఎక్కువ హృదయ స్పందన రేట్లను కలిగి ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న రెండు-మూడు నెలల తర్వాత చాలా మంది రోగులలో ఈ పరిస్థితి నెలకొంది. స్మార్ట్‌వాచ్‌ అందించే డేటాతో ముందుగానే రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు