ప్రపంచ టెక్‌ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..

13 Jan, 2024 16:20 IST|Sakshi

ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్‌ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్‌మన్‌ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్‌లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్‌ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్‌ సివోతో డేటింగ్‌ చేసి 2012లో శామ్‌ విడిపోయారు.

ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి.

శామ్ ఆల్ట్‌మన్, ఓపెన్‌ ఏఐ సీఈవో
హైస్కూల్‌లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్‌తో పెళ్లికి ముందు లూప్ట్‌ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ఆల్ట్‌మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్‌తో డేటింగ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్‌మాన్ త్వరలో మల్హెరిన్‌తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.

టిమ్ కుక్, యాపిల్ సీఈవో


యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్‌లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్‌’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు.

పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు


2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ థీల్‌ను బిలియనీర్‌గా మార్చింది.

క్రిస్ హ్యూస్, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు


మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్‌బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్‌డ్రిడ్జ్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్‌బుక్, మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు.

క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం


క్లాడియా బ్రిండ్‌ ఐబీఎంలో ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్‌గా ప్రకటించుకున్నారు.

ఇదీ చదవండి: బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి

ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో


యాపిల్‌, గూగుల్‌, ఇన్‌టుఇట్‌ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్‌ప్రాఫిట్‌ సంస్థ కాండిడ్‌లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు