శోభా- మజెస్కో.. షేర్ల జోరు

6 Oct, 2020 14:37 IST|Sakshi

క్యూ2లో పటిష్ట ఫలితాల అంచనాలు

14 శాతం దూసుకెళ్లిన శోభా లిమిటెడ్‌

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు ప్రతిపాదన

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన మజెస్కో

సరికొత్త గరిష్టానికి చేరిన మజెస్కో లిమిటెడ్‌

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 367 పాయింట్లు జంప్‌చేసి 39,341కు చేరగా.. నిఫ్టీ 95 పాయింట్లు బలపడి 11,598 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో రియల్టీ అభివృద్ధి సంస్థ శోభా లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మజెస్కో లిమిటెడ్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

శోభా లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో త్రైమాసిక ప్రాతిపదికన అమ్మకాల పరిమాణం 37 శాతం పెరిగినట్లు శోభా లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. దాదాపు 8.92 చదరపు అడుగులను విక్రయించినట్లు పేర్కొంది. విలువ ప్రకారం అమ్మకాలు 41 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఒక్కో చదరపు అడుగుకి సగటున రూ. 7,737 ధర లభించినట్లు తెలియజేసింది. గత ఐదు త్రైమాసిక ధరలతో పోలిస్తే ఇది అధికమని   వివరించింది. దీంతో శోభా షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 14 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 273 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 10.3 శాతం లాభంతో రూ. 264 వద్ద ట్రేడవుతోంది.

మజెస్కో లిమిటెడ్
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌నకు ప్రతిపాదించినట్లు ఐటీ కన్సల్టింగ్‌ కంపెనీ మజెస్కో లిమిటెడ్‌ పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు గురువారం(8న) సమావేశంకానున్నట్లు వెల్లడించింది. సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌ సైతం ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బైబ్యాక్‌ ప్రతిపాదనపై బుధవారం(7న) బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు టీసీఎస్‌ ఇటీవల వెల్లడించింది. కాగా.. బైబ్యాక్‌ వార్తలతో మజెస్కో షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 861 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం గమనార్హం!

మరిన్ని వార్తలు