స్విగ్గీలో సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ పెట్టుబడులు!

17 Apr, 2021 09:18 IST|Sakshi

స్విగ్గీలో గ్లోబల్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌  పెట్టుబడులు

3,348 కోట్ల పెట్టుబడి!

తుది దశలో చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ: ఫుడ్‌ ఆర్డర్లు, డెలివరీ సంస్థ స్విగ్గీలో గ్లోబల్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందుకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. స్విగ్గీలో 45 కోట్ల డాలర్ల (రూ. 3,348 కోట్లు)ను ఇన్వెస్ట్‌ చేసే యోచనలో సాఫ్ట్‌బ్యాంక్‌ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్‌తో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ విలువ 5 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్, అమన్సా క్యాపిటల్, థింక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, కార్మిగ్‌నాక్, గోల్డ్‌మన్‌ శాక్‌ 80 కోట్ల డాలర్లు(రూ. 5,862 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినట్లు ఇంతక్రితం స్విగ్గీ వెల్లడించింది.  

ఉద్యోగుల ద్వారా: కంపెనీ ఉద్యోగులకు వ్యవస్థాపక సీఈవో శ్రీహర్ష మాజేటి ఈ నెల మొదట్లో పంపిన ఈమెయిల్‌ ద్వారా స్విగ్గీ తాజా డీల్‌ వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రత్యర్థి సంస్థ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్విగ్గీ డీల్‌ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు