సాఫ్ట్‌బ్యాంక్‌.. పేటీఎం వాటా విక్రయం

17 Nov, 2022 07:40 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎమ్‌)లో 4.5 శాతం వాటా విక్రయానికి  సాఫ్ట్‌బ్యాంక్‌ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్‌డీల్‌ ద్వారా ఈ వాటాను 20 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1,627 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్‌వీఎఫ్‌ ఇండియా హోల్డింగ్స్‌ ద్వారా పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్‌ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది.

షేరుకి రూ. 555–601.55 ధరల శ్రేణిలో వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. పేటీఎమ్‌ ఐపీవో తదుపరి లాకిన్‌ గడువు ముగియడంతో సాఫ్ట్‌బ్యాక్‌ వాటా విక్రయ సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

షేరు పతనం 
బీఎస్‌ఈలో పేటీఎం షేరు బుధవారం(16న) 4 శాతం పతనమై రూ. 601.55 వద్ద ముగిసింది. ఈ ధరలో షేర్లను విక్రయిస్తే సాఫ్ట్‌బ్యాంక్‌కు 21.5 కోట్ల డాలర్లు లభిస్తాయి. 2017 చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌బ్యాంక్‌ 160 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. తదుపరి ఐపీవోలో 22 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీని విక్రయించింది. పేటీఎమ్‌లో ప్రస్తుత సాఫ్ట్‌బ్యాంక్‌ వాటా విలువ 83.5 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతోంది!

చదవండి: భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్‌ విషయాలు!

మరిన్ని వార్తలు